You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లంబర్ జాక్: మొద్దులు నరికే వరల్డ్ కప్‌లో రికార్డులు సృష్టించిన అమ్మాయి...
- రచయిత, షీలా ఫ్లిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
కరోలినా అర్బనోవా యుక్తవయసులో ఉన్నప్పుడు, ఆమె నివసించే చిన్న చెక్ (చెక్ రిపబ్లిక్ ) గ్రామంలోకి వచ్చిన కొత్త వ్యక్తి చెప్పే వరకు లంబర్‌జాక్ క్రీడల గురించి ఆమె ఎన్నడూ వినలేదు.
విస్కాన్సిన్‌లోని హేవర్డ్‌లో జరిగిన యాన్యువల్ లంబర్‌జాక్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు 24 ఏళ్ల అర్బనోవా
ఈ పోటీలకు హేవర్డ్ నగరం 1960 నుంచి ఆతిథ్యమిస్తోంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఈ పోటీల కోసం ఇక్కడకు చేరుకుంటారు. ఇందులో భాగంగా దుంగలను దొర్లించడం, కొయ్యడం, గొడ్డళ్లతో ముక్కలుగా నరకడం, వేగంగా వాటిపై పరుగెత్తడం లాంటి విభాగాల్లో ఔత్సాహికులు పోటీ పడతారు.
వీటిల్లో పురుషులు, మహిళలు విడివిడిగా, కొన్ని ఈవెంట్లలో ఇద్దరూ కలిసి పోటీపడతారు.
ఈ ఏడాది అమెరికాతోపాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 40మంది మహిళలు 66 మంది పురుష పోటీదారులతో చేరారు.
అర్బనోవా ఇందులో పాల్గొనడం మొదలు పెట్టినప్పటితో పోలిస్తే ఈ పోటీల్లో మహిళల ప్రాతినిధ్యం ఈసారి కాస్త ఎక్కువగా ఉంది.
‘‘యూరప్‌లో బహుశా ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఈ పోటీలో పాల్గొనేవారు. మేము ప్రతీ రోజూ కట్టెలు కొడతామని ఇక్కడి వారికి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను వింతగా చూశారు’’ అని అర్బనోవా బీబీసీతో అన్నారు.
"అది నన్ను మిగతా వాళ్లకంటే ప్రత్యేకంగా ఉంచుతుంది" అని ఆమె అన్నారు.
పాత రికార్డుల్ని బద్దలు కొట్టి...
అర్బనోవా ప్రతిభను ఆమె తల్లి, సోదరితో పాటు లంబర్‌జాక్ పోటీల్లో పాల్గొనే ఓ వ్యక్తి గుర్తించారు. వారు ఒక పశువుల కొట్టంలో వారానికొక రోజు ఆమెకు శిక్షణ ఇచ్చేవారు. వివిధ గొడ్డళ్లను, వాటిని ఉపయోగించడంలో మెలకువలను ప్రయత్నిస్తూ అనుభవజ్ఞులైన క్రీడాకారుల నుంచి సూచనలు పొందేవారు. యూరప్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొనేవారు.
ఆమె తాను వేగంగా పని చేయగలనని గుర్తించారు. ఆమె సృష్టించిన కొత్త రికార్డులు ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి.
అడ్డంగా నిలబెట్టిన చెక్క దిమ్మెను వేగంగా నరికే పోటీలో మహిళల స్టాండింగ్ బ్లాక్ కేటగిరీలో 9 అంగుళాల తెల్లటి పైన్ చెక్కను ఆమె 19.38 సెకన్లలో నరికేశారు. ఇది అంతకు ముందున్న రికార్డు 21.17 సెకన్లు.
మహిళల అండర్‌హ్యాండ్ చాప్ విభాగంలో పోటీదారులు ఒక చెక్క ముక్కపై నిలబడి ఆ చెక్క ముక్కను పాదాల మధ్య ఉంచి ముక్కలు చేస్తారు. అర్బనోవా 11 అంగుళాల తెల్లని పైన్ చెక్కను 21.28 సెకన్లలో ముక్కలు చేశారు. అంతకు ముందు ఈ విభాగంలో నమోదైన బెస్ట్ టైమింగ్ 24.26 సెకన్లు.
మహిళల్లో లంబర్‌జాక్ క్రీడల ప్రాబల్యం విస్తరిస్తుందనడానికి అర్బనోవా చక్కటి ఉదాహరణ. అమెరికాలో ఇవి ప్రత్యేక క్రీడలైనా చెక్ రిపబ్లిక్‌లో వీటి గురించి దాదాపు ఎవరికీ తెలియదని ఆమె చెప్పారు.
హేవర్డ్‌కు చెందిన మెరెడిత్ ఇంగ్‌బ్రెట్సన్ కథ వేరు. ఆమె కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఒక రికార్డును బద్దలు కొట్టారు.
ఒకదానికొకటి కలిపి పెట్టిన 8 దేవదారు దుంగల మీదుగా పోటీదారులు అటూ ఇటూ పరుగెత్తే ఉమెన్స్ బూమ్ రన్‌లో ఆమె విజయం సాధించారు.
ఈ పరుగును ఆమె 13.78 సెకన్లలో పూర్తి చేశారు. గతంలో ఈ రికార్డు 13.98 సెకన్లు. ఈ పోటీల్లో గెలుపు కోసం ఏడాది నుంచి తాను చాలా పట్టుదలగా ఉన్నానని, మద్యంతో పాటు లక్ష్య సాధనకు అడ్డంకిగా ఉన్న అన్నింటినీ వదిలేశానని ఆమె చెప్పారు.
ఇంగ్‌బ్రెట్సన్‌కు మూడేళ్ల వయసులోనే లంబర్ జాక్ స్పోర్ట్స్ గురించి తెలుసు.
1880లో కలప పరిశ్రమ ఆధారంగా ఏర్పడిన హేవర్డ్ నగరంలో స్థానికుల జీవితాల్లో ఈ క్రీడలు ప్రధాన భాగం.
ఆ ప్రాంతంలో ప్రతీ ఒక్కరూ "బహుశా కనీసం ఒక వేసవి కాలమైనా లాగ్ రోలింగ్ గురించి నేర్చుకుని ఉంటారు" అని ఇంగ్‌బ్రెట్సన్ చెప్పారు.
ఆమె ఇప్పుడు 28ఏళ్లుగా లాగ్‌రోలింగ్‌లో పోటీ పడుతూ ఇటీవలే రంపంతో కోయడం, చెక్కలను నరకడం మొదలు పెట్టారు.
పెరుగుతున్న మహిళల సంఖ్య
గత 30 ఏళ్లలో లంబర్‌జాక్ క్రీడలలో పాల్గొనే మహిళా పోటీదారుల సంఖ్య మూడింతలకు పైగా పెరిగిందని లంబర్‌జాక్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఈవెంట్ డైరెక్టర్ సమంతా లాసల్లే చెప్పారు.
ఆమెకు ఐదేళ్లు ఉన్నప్పటి నుంచి ఈ క్రీడలలో పాల్గొంటున్నారు. ఆరేళ్ల ఆమె కుమార్తె ఇప్పటికే ఆమె అడుగుజాడల్లో నడుస్తున్నారు.
1960లో జరిగిన తొలి ఈవెంట్ నుంచి మహిళలు ప్రపంచ చాంపియన్ షిప్‌లలో పాల్గొంటున్నప్పటికీ మొదట్లో వారు కేవలం లాగ్‌రోలింగ్‌కు మాత్రమే పరిమితమయ్యారు.
కట్టెల్ని గొడ్డలితో నరకడం, రంపంతో కోసే పోటీల్లో వారికి ప్రవేశం కల్పించడానికి సమయం పట్టిందని లాసల్లే వివరించారు.
ఉదాహరణకు అర్బనోవా కొత్త రికార్డు సాధించిన మహిళల స్టాండింగ్ బ్లాక్‌ను 2022లో చేర్చారు. "మేమింకా ఎక్కువగా చేయగలం. సంప్రదాయంగా పురుషులు చేసే పనులన్నీ మేము కూడా చేయగలమని మహిళలు చెబుతున్నారు" అని లాసల్లే తెలిపారు.
"అనేకమంది మహిళలు ఈ పోటీల కోసం సాధన చేశారు. వారిలో పోటీ తత్వం పెరిగింది. ఇదంతా చూసిన తర్వాత, ఈ పోటీల్లో పాల్గొనే సత్తా ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మగవాళ్ల మాదిరిగానే వాళ్లకు కూడా మనం అనుమతి ఇవ్వాలి" అని తాము భావించినట్లు లాసల్లే చెప్పారు.
ఈ పోటీల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇదంతా చూస్తే మహిళలు ఎంత బాగా రాణిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు.
ప్రైజ్ మనీ తక్కువైనా వెనక్కి తగ్గని పోటీదారులు
అర్బనోవా, ఇంగ్‌బ్రెట్సన్ ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏడాది పొడవునా శిక్షణ తీసుకోవడంతో పాటు కఠోరంగా శ్రమించారు. బరువులు ఎత్తడం, జాగింగ్, కార్డియో ఎక్సర్‌సైజులు, గొడ్డలితో దుంగలను నరకడంలో తమ నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు. వాళ్లకు కుటుంబం, కాలేజ్ వాతావరణంతో పాటు ప్రపంచమంతటా పర్యటించి స్నేహితుల్ని సంపాదించుకోవడం ఇష్టం.
పోటీల్లో పాల్గొన్నప్పుడు ఇచ్చే ప్రైజ్ మనీ అంతర్జాతీయ పోటీలకు హాజరయ్యేటప్పుడు అయ్యే ఖర్చులకు ఏ మూలకూ సరిపోదు.
ఉదాహరణకు విస్కాన్సిన్ చాంపియన్ షిప్‌లో ప్రతీ కేటగిరీలో విజేతలకు రూ. 96వేలు(1000 డాలర్లు) మాత్రమే ఇస్తారు.
అందుకే అర్బనోవా విస్కాన్సిన్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్నప్పుడు ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉన్నారు.
గత శీతాకాలంలో ఇంగ్‌బ్రెట్సన్, ఆమె భర్త (ఆయన కూడా పోటీలలో పాల్గొంటారు) ఆస్ట్రేలియాలోని టాస్మేనియా రాష్ట్రంలో ఆతిథ్యం పొందారు. ఈ ఏడాది హేవర్డ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న కెనడా, ఆస్ట్రేలియా ఆటగాళ్లకుక ఇంగ్‌బ్రెట్సన్ తల్లి వసతి కల్పించారు.
"అది చాలా ప్రత్యేకమైనది. మీరు ఎక్కడికైనా వెళితే, వాళ్ళు మీకు ఆశ్రయం ఇస్తారు. శిక్షణ ఇస్తారు. మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. హేవర్డ్ అందర్నీ ఆదరిస్తుంది. ఇందులో భాగం కావడం చాలా సరదాగా ఉంటుంది" అని ఇంగ్‌బ్రెట్సన్ అన్నారు.
కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ మహిళలు పోటీలలో పాల్గొనడం ఆమెకు స్ఫూర్తినిస్తోంది.
"ఈ ఏడాది పిల్లల తల్లులు ముగ్గురు లాగ్ రోలింగ్‌లో పాల్గొన్నారు. వాళ్లను అలా చూడటం ఆనందంగా ఉంది. వాళ్లిప్పటికీ గట్టి పోటీదారులుగా ఉన్నారు" అని ఇంగ్ బ్రెట్సన్ చెప్పారు.
స్కూళ్లలో లంబర్ జాకింగ్‌లో శిక్షణ
"అమెరికా వ్యాప్తంగా చాలా కాలేజీల్లో టింబర్ స్పోర్ట్స్ ఉన్నాయి. వాళ్లు పురుషులు, మహిళలకు లంబర్‌జాకింగ్ క్రీడను బోధిస్తూ, అందులోకి ప్రోత్సహిస్తున్నారు" అని హేవర్డ్ హైస్కూల్‌లో కమ్యూనిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, స్థానికంగా ఫిట్‌నెస్ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఇంగ్‌బ్రెట్సన్ అన్నారు.
ఈ వారం పాఠశాలలో, పట్టణంలో తనను ఒక సెలబ్రిటీలా చూశారని అలాగే ఈ క్రీడలో ఎదుగుతున్న యువ పోటీదారులు అభినందించినప్పుడు తనకు ప్రత్యేకంగా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.
ఇప్పుడు ఆమె ఆల్-రౌండ్ టైటిల్‌పై దృష్టి సారించారు.
"అనేక రంగాలలో సమర్థవంతంగా ఉండటం చాలా ముఖ్యం. కానీ అది చాలాకష్టం. దాన్ని సాధించడానికి ఒక స్థాయి అంకితభావం, నిబద్ధత అవసరం" అని ఆమె చెప్పారు.
అర్బనోవా తన విజయం స్ఫూర్తిదాయకంగా ఉందని అలాగే తను రికార్డులు సృష్టించే పరంపరను కొనసాగించాలని భావిస్తున్నారు.
"నేను ఇంకా ఎదుగుతూ నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు అమ్మాయిల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు నాకంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు" అని ఆమె చెప్పారు.
మిగతా విషయాలెలా ఉన్నా "ఇప్పుడు నా గురించి నాకు చాలా ఆనందంగా ఉంది" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)