You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఇది మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బా లేక ఒక పెద్ద అవకాశమా?
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
దిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నెల రోజులకు పైబడి తనకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు చేయడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
మోదీ ప్రభుత్వానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒక పెద్ద ఎదురుదెబ్బగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎందుకంటే, ఒక ఉద్యమం కారణంగా ప్రభుత్వ మంత్రులలో ఒకరు రాజీనామా చేయడం ఇదే తొలిసారి.
అంతకుముందు కూడా, వివిధ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై, మంత్రులపై ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చినప్పటికీ.. అది పెద్దగా ప్రభావం చూపలేదు.
ఈ విషయంలో.. ''మోదీ ప్రభుత్వంలో రాజీనామాలు లేవు'' అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటన తరచూ చర్చనీయాంశమవుతోంది.
రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ను పొగుడుతూ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఒక పోస్టు చేశారు.
''భారతీయ విద్యా వ్యవస్థను సంస్కరించడంలో, చరిత్రాత్మక జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ 2020) విజయవంతంగా అమలు చేయడంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. ఇతర అనేక ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా ఆయన నేతృత్వం వహించారు'' అని నితిన్ నబిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇచ్చే సందేశమేంటి? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు బీబీసీ కొంతమంది నిపుణులతో మాట్లాడింది.
'విద్యార్థుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం'
2014 నుంచి మోదీ ప్రభుత్వ విధానాలపైన కావచ్చు, మరేదైన సమస్యపైన కావచ్చు... ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఉపాధి, నియామక పరీక్షలు, సీఏఏ-ఎన్ఆర్‌సీ, ఎస్ఐఆర్ వంటి పలు అంశాలపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, యువత వీధుల్లోకి వచ్చారు.
కానీ, ఈ నిరసనలుగానీ, ఉద్యమాలుగానీ మోదీ ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో.. బీజేపీ ఒక ఎన్నిక తర్వాత మరొక ఎన్నికలో విజయం సాధిస్తూనే ఉంది. వారికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి సమస్యను చాకచక్యంగా తిప్పికొట్టింది.
కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ జూన్ 20 నుంచి దిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన చేస్తూనే ఉన్నారు.
జూలై 17 వరకు ఈ నిరసనలు పెద్దగా ప్రభావం చూపినట్లు కనిపించనప్పటికీ... జూలై 18 ఉదయం సోనమ్ వాంగ్‌చుక్‌ను దిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నిరసన స్థలం నుంచి తొలగించి ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ సంఘటన తర్వాత.. విద్యార్థుల డిమాండ్లకు పెద్ద ఎత్తున యువత నుంచి మద్దతు లభించింది. దీని తర్వాత.. జూలై 20న సీజేపీ పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ సమయంలో పోలీసు చర్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేశారు.
ఆ తర్వాత.. రాజకీయాలు, క్రీడలు, సినిమాలు, కళలు, ఇతర ఎన్నో రంగాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా జూలై 25న అంటే శనివారం విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
"ప్రధానంగా చెప్పాలంటే, ఇది గత 4-5 రోజులుగా పడిన తీవ్రమైన ఒత్తిడి ఫలితంగా సాధించిన విజయమే. విద్యార్థులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ముంబయి, పుణె, లఖ్‌నవూ, జైపూర్ ఇలా చాలాచోట్లా ఆందోళనలు మొదలయ్యాయి. ఇక బిహార్‌లోని పట్నా వంటి పెద్ద నగరాల గురించి చెప్పనక్కర్లేదు. ఖగౌల్ వంటి చిన్న ప్రాంతాల్లో కూడా యువత రోడ్లపైకి వచ్చారు. దర్భంగా, సివాన్, చాప్రా, ఔరంగాబాద్, జెహానాబాద్, షేక్‌పురా వంటి అనేక ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్లపై నిరసన తెలిపారు" అని సీనియర్ జర్నలిస్ట్ లవ్ కుమార్ మిశ్రా అన్నారు.
'ప్రభుత్వానికి ఎదురుదెబ్బే, కానీ ఒక అవకాశం కూడా'
ప్రతిపక్షాల నుంచి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనకరమని సీనియర్ జర్నలిస్ట్ నీర్జా చౌధరి అన్నారు.
‘‘ప్రధాని మోదీకి, ఆయన ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, ఈ ఉద్యమం మరింత పెరిగేది. యువత ఆగ్రహాన్ని చల్లబర్చడానికి ఆయన రాజీనామా అవసరం'' అని అన్నారు.
ప్రజాస్వామ్య మార్గాల ద్వారా మార్పు తీసుకు రావచ్చని ఈ ఉద్యమం నిరూపిస్తుందని నీర్జా చౌధరి భావిస్తున్నారు.
అయితే, సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ మాత్రం దీనిని ప్రభుత్వానికి ఒక షాక్‌గానూ, అలాగే ఒక అవకాశంగానూ చూస్తున్నారు.
ప్రతిపక్షాలు చీలిపోతే ఏం జరుగుతుంది?
''ఇలా జరిగితే, కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ వంటి అనేక బిల్లులను ఆమోదింపజేసుకుంటుంది. అది వారికి చేజారిన ఆటను గెలిచినట్లు అవుతుంది" అని రషీద్ కిద్వాయ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం చాలా క్లిష్టమైన రోజని నిరూపించింది. సీజేపీ, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.
పెల్లెట్ గన్‌తో గాయపడ్డ వ్యక్తితో కలిసి శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ ఒత్తిడి శనివారం కూడా కొనసాగింది.
మరోవైపు, దిల్లీలో జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా '' కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది'' అని వ్యాఖ్యానించారు.
"మేం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే మాట్లాడే వాళ్లం కాదు. కానీ, ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు" అని ఆయన అన్నారు.
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రభావం ఎలా ఉండొచ్చు?
''ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుకాల ఆర్ఎస్ఎస్ ఒత్తిడి, మోహన్ భగవత్ ప్రకటన కూడా ఉంటాయని నేను అనుకుంటున్నా. ఈ ఉద్యమానికి ఏ రాజకీయ నాయకుడూ నాయకత్వం వహించలేదు. ఇది విద్యార్థుల ఉద్యమం, విద్యార్థుల కోసం, విద్యార్థులతోనే నడిచింది. ఈ కోణంలో ఇది ప్రత్యేకమైనది" అని లవ్ కుమార్ మిశ్రా అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు ముప్పుగా పరిణమించి ఉండేదని లవ్ కుమార్ మిశ్రా చెప్పారు.
''భారత్‌లో నిరుద్యోగంతో సహా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులు, పేపర్ లీక్ కారణంగా ఒక్కసారిగా రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇకపై దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది" అని తెలిపారు.
''యువతను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.. ఇప్పుడు వారు బొద్దింక అనే పదానికి కొత్త అర్థాన్ని వెతకాల్సి వస్తుందనిపిస్తోంది'' అని అన్నారు.
ఒక కేసు విచారణ సందర్భంగా మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ.. ''కొంతమంది యువకులు ఉద్యోగాలు లేకపోవడం వల్ల, వారి వృత్తిలో రాణించకపోవడం వల్ల వాళ్లంతా బొద్దింకల్లా ప్రతి చోటకూ విస్తరిస్తారు'' అని వ్యాఖ్యానించారు.
అయితే, సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించిన తర్వాత మే 16న జారీ చేసిన ఒక ప్రకటనలో, తన వ్యాఖ్యలు నకిలీ లేదా ఫోర్జరీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వారికి వ్యతిరేకంగా మాత్రమేనని, దేశంలోని సాధారణ యువత గురించి కాదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. అభిజీత్ దీప్కే ‘కాక్రోచ్’ అనే పదంతో సోషల్ మీడియాలో హాస్యభరితంగా ప్రారంభించిన కార్యక్రమానికి వెల్లువెత్తిన మద్దతు చూసి, ఆయన ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీనే ప్రారంభించారు.
''ఇది యువతకు లభించిన అతిపెద్ద విజయం. సమర్థవంతమైన రాజకీయ నాయకులను తయారు చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి, అలాగే ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది'' అని నీర్జా చౌధరి అన్నారు.
అయితే, ఈ విజయంలో ప్రతిపక్షానికి పెద్ద సవాలు ఎదురవుతుందని రషీద్ కిద్వాయ్ భావిస్తున్నారు.
''ప్రస్తుతం ప్రధాని మోదీ, ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి మాట్లాడుతుంది. అయితే, దీనివల్ల ప్రజలపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో యూపీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి'' అని చెప్పారు.
''ఒకవేళ యూపీలో బీజేపీ మళ్లీ గెలిచి, పంజాబ్‌లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అది అన్ని పార్టీలకు పెద్ద సందేశం అవుతుంది'' అని అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)