'పాక్‌ పాలిత కశ్మీర్‌‌‌'లో ఎన్నికల ముందు చెలరేగిన హింసలో ఇంతమంది ఎందుకు చనిపోయారు, అసలు వివాదమేంటి?

పాక్ పాలిత కశ్మీర్, ఎన్నికల హింస, శరణార్థుల రిజర్వేషన్లపై వివాదం

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, షాజాద్ మాలిక్
    • హోదా, బీబీసీ ఉర్దూ
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

నఖాష్ జర్దాద్ ఉండకూడని సమయంలో, ఉండకూడని ప్రదేశంలో ఉండిపోయారు.

జర్దాద్ విద్యా శాఖలో ఉద్యోగి.

పాక్ పాలిత కశ్మీర్‌లోని రావలాకోట్‌లో పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న సమయంలో, అక్కడికి సమీపంలోని తన గేదెల ఫాంలో ఉన్నారు జర్దాద్. ఫాం చుట్టూ ఉన్న రోడ్లన్నీ మూతపడడంతో జర్దార్ ఇంటికి వెళ్లలేకపోయారు.

ఆ సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి.

ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ దూసుకొచ్చి 30 ఏళ్ల జర్దాద్‌కు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారని ఆయన బంధువు అల్తాఫ్ హుస్సేన్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పాక్ పాలిత కశ్మీర్‌లో శాసన సభ ఎన్నికల ముందు జరిగిన హింసలో మరణించిన కనీసం 40 మందిలో జర్దాద్ కూడా ఒకరు. వీరిలో 34 మంది నిరసనకారులు కాగా, ఆరుగురు పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. తీవ్రమైన హింసాకాండ చెలరేగిన ప్రాంతాల్లో రావలాకోట్ కూడా ఒకటి.

యాక్టివిస్టుల కూటమి అయిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పిలుపునిచ్చిన లాంగ్‌మార్చ్‌లు, నిరసన ప్రదర్శనలపై భద్రతా బలగాలు తీవ్రమైన బలప్రయోగానికి పాల్పడ్డాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

దశాబ్దాల కిందట భారత్ పాలిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్‌కు వలస వచ్చిన శరణార్థుల కోసం స్థానిక అసెంబ్లీలో 12 శాసన సభ స్థానాలను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జేఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా, ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జేఏఏసీపై నిషేధం విధించి, నిరసనకారులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది.

పాక్ పాలిత కశ్మీర్, ఎన్నికల హింస, శరణార్థుల రిజర్వేషన్లపై వివాదం

ఫొటో సోర్స్, Getty Images

శరణార్థులకు అసెంబ్లీ స్థానాల రిజర్వేషన్‌పై వివాదం

మొత్తం 53 మంది సభ్యులున్న శాసన సభలో ఈ 12 స్థానాల రిజర్వేషన్ వ్యవహారం చాలాకాలంగా ఈ ప్రాంతంలో వివాదాస్పద అంశంగా ఉంది. ఈ అసెంబ్లీలో 33 ప్రత్యక్ష ఎన్నికలు జరిగే స్థానాలు కాగా, మరో 8 సీట్లు మహిళలు, ఇతరుల కోసం రిజర్వ్ చేసి ఉన్నాయి.

భారత్ పాలిత కశ్మీర్ నుంచి వలసవచ్చి, ఇక్కడ స్థిరపడిన కశ్మీరీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించే ఈ చట్టాన్ని 1970లలో తీసుకొచ్చారు. ఈ సుదీర్ఘ వివాదం (కశ్మీర్ వివాదం) పరిష్కారమైన తర్వాత, ఎప్పటికైనా తమ స్వగ్రామాలకు వెళ్లొచ్చనే ఆశతో భారత్ పాలిత కశ్మీర్ నుంచి వలసొచ్చి పాకిస్తాన్‌లో స్థిరపడిన ప్రజలకు కూడా పాలనలో భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చారు.

అయితే, ఎవరికైతే ఈ స్థానాలు కేటాయించారో వారిలో చాలామంది పాక్ పాలిత కశ్మీర్‌లో నివసించడం లేదు. అందువల్ల, స్థానికులు ఈ స్థానాల నుంచి పోటీ చేయకుండా ఆంక్షలు విధించినట్టైంది.

ఈ రిజర్వుడ్ స్థానాల కారణంగా స్థానిక ప్రాతినిధ్యం తగ్గుతోందని, శాసన సభలోని అన్ని స్థానాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికే చెందాలని, రిజర్వేషన్ రద్దు చేయాలని జేఏఏసీ డిమాండ్ చేస్తోంది.

అయితే, ఈ రిజర్వేషన్లు చాలా అవసరమని అధికారులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయని, మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తొలి దశ పోలింగ్ జులై 27న జరగనుంది.

గత 2021 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయితే, 2022లో పాకిస్తాన్ పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానంతో ఆ పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఈ నాలుగేళ్లలో, ఈ ప్రాంతం నలుగురు ప్రధానులను చూసింది. ఈసారి ఫలితాలను అంచనా వేయడం కష్టంగా మారింది.

పాక్ పాలిత కశ్మీర్, ఎన్నికల హింస, శరణార్థుల రిజర్వేషన్లపై వివాదం

ఫొటో సోర్స్, Getty Images

ర్యాలీలు, హింసాత్మక ఘటనలు

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ముజఫరాబాద్‌ను బీబీసీ సందర్శించింది. అక్కడ ఉద్రిక్తత, భయాందోళనల వాతావరణం స్పష్టంగా కనిపించింది.

ఎన్నికల గురించి మాట్లాడేందుకు చాలామంది ముందుకు రావడం లేదు.

ఎన్నికలకు లేదా ఏదైనా అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే జేఏఏసీ తమను 'ద్రోహులుగా' ముద్ర వేస్తుందనే భయం కొందరిది.

మరోవైపు, జేఏఏసీకి మద్దతిచ్చేవారు చట్టపరమైన సంస్థలు, నిఘా అధికారుల వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ఇక్కడ హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

అభ్యర్థుల వాహనాలు, ఇతర ఆస్తులకు నిప్పుపెట్టడంతో పాటు కొందరు అభ్యర్థులపై దాడులు కూడా జరిగాయి. ఈ ఘటనలన్నింటికీ జేఏఏసీనే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.

దీంతో అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా ప్రచారం చేసుకుంటున్నారు.

రాజకీయ సభలు కేవలం ఇళ్లలోని డ్రాయింగ్ రూమ్‌లు, వీధి చివరకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం పరిస్థితులపై మాట్లాడేందుకు దాదాపు ఎవరూ ముందుకు రావడం లేదు.

దేశ అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ ఎన్) తరఫున పోటీ చేస్తున్న ఏకైక మహిళా అభ్యర్థి నూరీన్ ఆరిఫ్ మాట్లాడుతూ, జేఏఏసీ నిరసన పిలుపు కారణంగా బహిరంగ సభలకు బదులు నేరుగా ప్రజల ఇళ్లకే వెళ్లి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నట్లు బీబీసీకి తెలిపారు.

ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన సర్దార్ ముఖ్తార్ ఖాన్ మాట్లాడుతూ, జేఏఏసీ చేపట్టిన నిరసనలకు యువతలో విపరీతమైన ఆదరణ ఉందని, అందువల్ల తాము కూడా పరిమిత ప్రచారానికే పరిమితమవ్వాల్సి వచ్చిందన్నారు.

"ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ముందుకు సాగాలి" అని ఆయన బీబీసీతో అన్నారు.

ప్రచారం చివరి వారంలోనే పీపీపీ, పీఎంఎల్ ఎన్ నాయకులు ఈ ప్రాంతంలో బహిరంగ ర్యాలీలు నిర్వహించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి.

అయితే ఉద్రిక్త పరిస్థితులు, ప్రచారం పరిమితంగానే ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడమే "ఏకైక పరిష్కారం" అని పాకిస్తాన్ కశ్మీర్ వ్యవహారాల మంత్రి అమీర్ ముకామ్ అభిప్రాయపడ్డారు.

"ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో, వారు అధికారంలోకి వచ్చి వారి భవిష్యత్తు, తలరాతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ అధికారం కేవలం కొద్ది వందలు లేదా వెయ్యి మందికి మాత్రమే కాదు. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించే హక్కు ఇక్కడ కశ్మీర్‌లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలదే" అని ఆయన బీబీసీతో అన్నారు.

అయితే, ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహణకు ఇది సరైన సమయం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినా "వాటికి ఎలాంటి విశ్వసనీయత ఉండదు" అని ముజఫరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ అధిపతి జాహిద్ అమీన్ మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.

పాక్ పాలిత కశ్మీర్, ఎన్నికల హింస, శరణార్థుల రిజర్వేషన్లపై వివాదం

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయంగా ఆందోళన

మరోవైపు, ఈ ప్రాంతంలో జరుగుతున్న హింస అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది.

జులై 17న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అధిపతి వోల్కర్ టర్క్ స్పందిస్తూ, "ఈ అలజడుల కారణంగా మరణించిన నిరసనకారులు, భద్రతా సిబ్బంది సహా అన్ని మరణాలపై తక్షణం సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలి" అని కోరారు.

ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జేఏఏసీపై నిషేధం విధించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. "ఒక సామాజిక సంస్థను నేరపూరిత సంస్థగా పరిగణించడం, సమావేశాలపై కఠిన ఆంక్షలు విధించడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, సంఘాలను ఏర్పాటు చేసుకునే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోంది" అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ హింసకు "దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణే కారణం" అని పాకిస్తాన్ పొరుగుదేశమైన భారత్ ఆరోపిస్తోంది.

అయితే, భారత్ ప్రకటనలను పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో తోసిపుచ్చారు. ఈ పరిస్థితికి "సామరస్యపూర్వక" పరిష్కారం దొరకాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. నిజానిజాలు వెలికితీసి, సయోధ్యకు దోహదపడే కమిషన్ ఏర్పాటుకు ఆయన పిలుపునిచ్చారు. జేఏఏసీ, ప్రభుత్వం రెండింటిదీ తప్పుందని పేర్కొంటూ, సామాన్యులను శిక్షించడం ఆపాలని విజ్ఞప్తి చేశారు.

"మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు ఇప్పటికీ అందుబాటులో లేవు. ఇప్పటికే 40 రోజులు దాటిపోయింది. భద్రతాపరమైన సమస్యలు తీవ్రమైనప్పుడు తాత్కాలిక ఆంక్షలు అవసరమని నేనూ ఒప్పుకుంటాను. కానీ, మొత్తం ప్రాంతంలో 40 రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేయడం ప్రజలందరికీ సామూహిక శిక్ష విధిస్తున్న భావన కలిగిస్తోంది" అని ఆయన బీబీసీ ఉర్దూకు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)