మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?

చెన్నై లవ్ స్టోరీ మూవీ

ఫొటో సోర్స్, facebook/Kiran Abbavaram

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ప్రేమకథలు కాలాన్ని దాటి నిలిచిపోవాలంటే తెరపై కనిపించిన జంట ప్రేమలో ప్రేక్షకుడు పడిపోవాలి.

సినిమా ముగిసిపోయాక కూడా ఆ పాత్రలు, ఆ సంభాషణలు, ఆ పాటలు మనసులో నాటుకుపోవాలి. అదే క్లాసిక్ ప్రేమకథల్లోని మ్యాజిక్.

'చెన్నై లవ్ స్టోరీ' సినిమా మొదలైనప్పటి నుంచే దీనిని 'క్లాసిక్ లవ్ స్టోరీ'గా చిత్రబృందం ప్రచారం చేసింది.

కిరణ్ అబ్బవరం మంచి ఫామ్‌లో ఉండటం, 'బేబీ'తో యువతను ఆకట్టుకున్న దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ అందించడంతో అంచనాలు పెరిగాయి.

మరి నిజంగానే 'చెన్నై లవ్ స్టోరీ' క్లాసిక్ ప్రేమకథల జాబితాలో చోటు సంపాదించుకుందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ, ఓ బేబీ, కలర్ ఫోటో, ప్రేమ, దేవదాస్

ఫొటో సోర్స్, x.com/Kiran_Abbavaram

లేడీ దేవదాస్... కొత్త ట్రీట్‌మెంట్

దర్శకుడు కావాలని చెన్నైకి వచ్చిన అనాథ యువకుడు స్టీవెన్‌ శంకర్‌ (కిరణ్ అబ్బవరం), ప్రేమలో మోసపోయి జీవితంపైనే ఆశ కోల్పోయిన నివి(శ్రీ గౌరీ ప్రియ) జీవితంలోకి అనుకోకుండా అడుగుపెడతాడు. స్టీవెన్‌ శంకర్‌ స్నేహంతో నివి నెమ్మదిగా బాధ నుంచి కోలుకుంటుంది. నివి మనసులో స్టీవెన్‌పై ప్రేమ చిగురిస్తుంది. ఈ ప్రేమకు మరో ఊహించని మలుపు ఎదురవుతుంది? ఏమిటా మలుపు? ఈ ప్రేమకథకు ఎలాంటి ముగింపు దొరికుందనేది మిగతా కథ.

ప్రేమకథలో కొత్తదనం అనేది ఎప్పుడూ కథలోనే ఉండాల్సిన అవసరం లేదు. అదే కథను కొత్త కోణంలో, కొత్త ట్రీట్‌మెంట్‌తో చెప్పగలిగితే ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఆ విషయంలో చెన్నై లవ్ స్టోరీ తొలి సగం ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమలో విఫలమై దేవదాసులుగా మారే కథానాయకులను ఎన్నోసార్లు చూశాం. కానీ ఇక్కడ ఆ బాధను కథానాయిక భుజాలపై పెట్టారు.

ప్రేమలో మోసపోయిన నివి మద్యానికి బానిసై, కుటుంబానికి దూరమై, ఒంటరితనంలో కృంగిపోవడం వంటి భావోద్వేగాలను ఇప్పటివరకు ఎక్కువగా హీరోల కోణంలోనే చూసిన ప్రేక్షకులకు ఇది కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో 'తేరే ఇష్క్ మేన్' గుర్తొచ్చే పోలికలు కనిపించినా, వాటిని దర్శకుడు రవి నంబూరి కథలో మేళవించిన విధానం భిన్నంగా ఉంటుంది.

స్టీవెన్ శంకర్ పాత్ర నివి జీవితంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సినిమా పూర్తిగా మరో మూడ్‌లోకి వెళ్తుంది. అతని అమాయకత్వం, జీవితాన్ని చూసిన వ్యక్తిలా కనిపించే పరిపక్వత, నివిలో తీసుకొచ్చే మార్పు సహజంగా అనిపిస్తాయి.

కథ వేగంగా పరుగులు పెట్టకపోయినా, పాత్రల మధ్య పెరుగుతున్న అనుబంధం, పాటలు, సన్నివేశాల అల్లిక, ఇంటర్వెల్‌కు ముందు ప్రేమ చిగురించే విధానం, ఆ వెంటనే వచ్చే ట్విస్ట్ రెండో భాగంపై సహజంగానే ఆసక్తిని పెంచుతాయి.

 కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ, ఓ బేబీ, కలర్ ఫోటో, ప్రేమ, దేవదాస్

ఫొటో సోర్స్, srigouripriya/insta

ఫొటో క్యాప్షన్, కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించారు.

ఫాంటసీ ఉంది కానీ...

తొలి సగంలోనే ఓ ప్రత్యేకమైన ట్రాక్ ద్వారా ఈ కథలో ఫాంటసీ ఎలిమెంట్‌ను పరిచయం చేసిన దర్శకుడు, ద్వితీయార్ధాన్ని పూర్తిగా హీరో-హీరోయిన్ మధ్య సాగే ఫాంటసీ ప్రేమకథగా మలిచాడు. అయితే ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తది కాదు. ఘోస్ట్, జస్ట్ లైక్ హెవెన్ (తెలుగులో ఎందుకంటే... ప్రేమంట!), ది సిక్స్ సెన్స్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన ఆల్వేస్, బీ విత్ యూ వంటి ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకులు ఇప్పటికే ఈ తరహా కథనాన్ని చూశారు. ఇలాంటి కథలు విజయవంతం కావాలంటే ప్రేక్షకుడు ఆ ఫాంటసీ ప్రపంచాన్ని పూర్తిగా నమ్మాలి. అదే సమయంలో కథ ఎటు వెళ్తోంది? పాత్రల లక్ష్యం ఏమిటి? అనే స్పష్టత కూడా ఉండాలి.

చెన్నై లవ్ స్టోరీలో సమస్య అక్కడే మొదలవుతుంది. ద్వితీయార్ధంలో హీరో, హీరోయిన్ ప్రయాణం ఒక స్పష్టమైన లక్ష్యం వైపు సాగుతున్న భావన కలగదు. హీరో పాత్రలోని జెలసీ అంశాలు కొన్ని చోట్ల నవ్వించినా, ప్రేమకథలో లక్ష్యం కుదరలేదు.

క్లైమాక్స్‌లో దర్శకుడు బలమైన ఎమోషనల్ సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, ఆ భావోద్వేగాలకు అవసరమైన పునాది ద్వితీయార్ధంలో అంత బలంగా నిర్మితమవ్వలేదు. అందుకే కళ్ల ముందు ఎమోషన్ కనిపించినా, అది గుండెల్లోకి దిగే స్థాయికి చేరదు. పాత్రలకు మరింత స్పష్టమైన లక్ష్యం, ఆ ప్రయాణానికి బలమైన నాటకీయ సంఘర్షణ ఉండి ఉంటే, ఈ ఫాంటసీ ప్రేమకథ మరో స్థాయిలో నిలిచే అవకాశం ఉండేది.

 కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ, ఓ బేబీ, కలర్ ఫోటో, ప్రేమ, దేవదాస్

ఫొటో సోర్స్, srigouripriya/insta

ఫొటో క్యాప్షన్, కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ పాత్రలో కనిపించాడు.

చూడముచ్చటైన జోడీ

చెన్నై లవ్ స్టోరీకి పెద్ద బలం కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జోడీ. ఇద్దరూ తెరపై ఎంతో సహజంగా కనిపించారు.

స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం అమాయకత్వం, చలాకీతనం, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా పలికించారు. దర్శకుడిగా ఎదగాలనే కలతో పాటు, అనాథగా పెరిగిన జీవితంలోని భావోద్వేగ భారాన్ని మోసే యువకుడిగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే సన్నివేశం అతని పాత్రపై ప్రేక్షకుడిలో బలమైన సహానుభూతి కలిగిస్తుంది. అయితే ఆ భావోద్వేగాన్ని ప్రేమకథతో చివరి వరకు ముడిపెట్టడంలో దర్శకుడు తడబడ్డాడు. అదే బలాన్ని క్లైమాక్స్ వరకు కొనసాగించి ఉంటే ఈ ప్రేమకథ ప్రభావం మరింత పెరిగేది.

తెలుగమ్మాయి శ్రీగౌరీ ప్రియ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమలో విఫలమై మానసికంగా కుంగిపోయిన యువతి పాత్రలో ఆమె ఎంతో సహజంగా కనిపించింది. మద్యం సేవించే సన్నివేశాలు కూడా ఎక్కడా అతిగా అనిపించకుండా హుందాగా మలిచింది. ద్వితీయార్ధంలో పాత్ర రచన కొంత గందరగోళంగా మారినా, ఆ సంక్లిష్టమైన పాత్రను తన నటనతో నిలబెట్టే ప్రయత్నం చేసింది.

త్రిగుణ్‌కు స్క్రీన్ టైమ్ తక్కువే అయినా, కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలో తనదైన ముద్ర వేశాడు. స్నేహితులుగా కనిపించిన మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో చక్కగా ఒదిగిపోయారు. దర్శకులు పి. వాసు, కరుణ కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు.

chennai love story

ఫొటో సోర్స్, kiran abbavaram/facebook

మణిశర్మ మ్యాజిక్

ఈ సినిమాకు కనిపించని హీరో మణిశర్మ. ఎన్నో చిరస్మరణీయ మెలోడీలను అందించిన ఆయన, ఈ సినిమాకూ తన సంగీతంతో ప్రత్యేకమైన ఆత్మను ఇచ్చారు. పాటలు వినసొంపుగా ఉండటమే కాదు, నేపథ్య సంగీతం ప్రతి భావోద్వేగాన్ని మరింత బలంగా మోసుకొచ్చింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కథనం తడబడిన చోట్ల కూడా తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకుడిని కథలోనే ఉంచే ప్రయత్నం చేశారు.

విశ్వాస్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు మరో బలం. చెన్నై నగరం, హీరో-హీరోయిన్లు నివసించే ఇల్లు, ఆ పరిసరాలు అన్నింటినీ ఎంతో ఆహ్లాదకరంగా చూపించారు. కొన్ని ఫ్రేమ్స్‌లో కనిపించే కవితాత్మకత మణిరత్నం, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాల విజువల్ శైలిని గుర్తు చేస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో సాంకేతిక బృందం పెట్టిన శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది.

తొలి సగంలో కొత్త ట్రీట్‌మెంట్, ఆకట్టుకునే జోడీ, మణిశర్మ సంగీతం సినిమాను బలంగా నిలబెడతాయి. కానీ ద్వితీయార్ధంలో కథకు స్పష్టమైన లక్ష్యం, పాత్రల భావోద్వేగ ప్రయాణానికి కావాల్సిన బలం కొరవడటంతో, క్లాసిక్‌గా నిలిచే అవకాశం ఉన్న ఈ ప్రేమకథ... చివరికి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగానే పరిమితమైపోతుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)