సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?

ఫొటో సోర్స్, PTI
జులై 18న దిల్లీ పోలీసులు సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ నుంచి బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినప్పుడు ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోనమ్ సమ్మతి లేకుండా ఆయనకు నోటి ద్వారా, నరాల ద్వారా ఏమీ ఇవ్వకూడదని గీతాంజలి చెప్పారు.
కానీ ఒక రోజు తర్వాత, ఎంపీలు తనను కలిసి పార్లమెంట్‌లో విద్యా సంస్కరణల అంశాన్ని లేవనెత్తితే సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమిస్తారని గీతాంజలి చెప్పారు.
అలాగే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కూడా ఆమె మళ్లీ ప్రస్తావించలేదు. గురువారం అర్ధరాత్రి సోనమ్ వాంగ్‌చుక్ కూడా నిరాహార దీక్ష విరమించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనతో దీక్ష విరమింపజేశారు.
సీనియర్ జర్నలిస్ట్ ఊర్మిలేష్ ఎక్స్‌లో రెండు ఫోటోలు పోస్ట్ చేశారు. ఒక ఫోటోలో జేపీ నడ్డా సోనమ్ వాంగ్‌చుక్‌తో నిరాహార దీక్ష విరమింపజేస్తుండగా, మరో ఫోటోలో నటి షబానా అజ్మీ ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ ఝా జంతర్ మంతర్ వద్ద యువ నిరసనకారులతో నిరాహార దీక్షను విరమింపజేస్తూ కనిపించారు.

ఈ ఫోటోలకు ఊర్మిలేష్ "చాలా సందర్భాల్లో, చిత్రాలే రహస్యాలను వెల్లడిస్తాయి" అని క్యాప్షన్ పెట్టారు.
"ఇది మంచి సందేశాన్ని ఇవ్వడం లేదు. సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించడానికి ఒక తటస్థ వ్యక్తిని పిలిచి ఉండవచ్చు, లేదా కనీసం సీజేపీ ప్రతినిధితోనైనా విరమింపజేసి ఉండవచ్చు" అని న్యూస్ వెబ్‌సైట్ 'ది వైర్' వ్యవస్థాపకులు ఎంకే వేణు ఎక్స్‌లో రాశారు.
"జాతీయ భద్రత చట్టాన్ని అమలు చేశారు, తర్వాత తొలగించారు. నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్లను అక్కడ నుంచి తొలగించారు. వారితో నీళ్లు తాగించారు. కనీసం ఆయన పిల్లల మధ్య నిరాహార దీక్ష విరమించి ఉండాల్సింది" అని సోనమ్ వాంగ్‌చుక్ గురించి గీత రచయిత స్వానంద్ కిర్కిరే ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ ఆలోచన విధానాల మధ్య వ్యత్యాసాన్ని చాలామంది ఎత్తిచూపుతున్నారు.
"ప్రధాన మంత్రి నివాసం బయట నిరసన తెలిపే బదులు రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్ద కూర్చోవాల్సిందని వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అన్నారు. ఇది ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే, రాహుల్ గాంధీ ధర్నాను సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ సీజేపీ డిమాండ్లకు మద్దతిస్తే జంతర్ మంతర్ లేదా మరెక్కడైనా సరే వారితో కలిసేందుకు తమకు ఆమోదమే అని అన్నారు" అని వేణు ఎక్స్‌లో రాశారు.

ఫొటో సోర్స్, @Wangchuk66
సోనమ్ - సీజేపీ వైఖరుల్లో వ్యత్యాసం
"ఈ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ, సోనమ్ వాంగ్‌చుక్ వైఖరి వేర్వేరుగా ఉంది. బీజేపీ మంత్రులతో చర్చల సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని పార్లమెంటులో చర్చించవచ్చని అన్నారు. అయితే, సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే చర్చల ప్రక్రియ ముందుకు సాగాలని పట్టుబట్టింది" అని ఎంకే వేణు రాశారు.
"ప్రధాన మంత్రి నివాసం బయట జరిగిన నిరసనలో చిత్తశుద్ధి లోపించిందని అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని కలిసి ఉంటే బావుండేది. ఇకపై ప్రజలను మోసం చేయలేరు. ఇది చైతన్యవంతమైన భారత దేశం" రాహుల్ గాంధీ ధర్నాకు సంబంధించి ఇండియా టుడే షోలో రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో మాట్లాడుతూ గీతాంజలి అన్నారు.
సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ నుంచి ఆసుపత్రికి తరలిచిన తర్వాత ఆసుపత్రిలో ఆయన ప్రభుత్వ ప్రతినిధులను కలవడం కొనసాగించారు. అయితే, సీజేపీ ప్రతినిధులతో ఆయన మాట్లాడిన ఫోటోలు ఏవీ బయటకు రాలేదు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ వ్యవస్థాపకుకుడు అభిజీత్ దీప్కే విజ్ఞప్తి చేశారు. అయితే, వాంగ్‌చుక్‌తో జేపీ నడ్డా దీక్ష విరమింపజేస్తారనే విషయం సీజేపీకి కూడా తెలియదు.
ఈ సోమవారం సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేంద్ర మంత్రి నడ్డా కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిశారు.
అయితే, చర్చల కోసం మంత్రి కార్యాలయం లేదా నివాసంలో కాకుండా తటస్థ ప్రదేశంలో కలుస్తామని షరతు విధించారు.
ఇక్కడ కూడా సోనమ్ వాంగ్‌చుక్, సీజీపీ వైఖరిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రమంత్రి చేతులమీదుగా నిరాహార దీక్ష విరమిస్తే, చర్చల కోసం ఆయన కార్యాలయానికి లేదా నివాసానికి వెళ్లేందుకు సీజేపీ నిరాకరిస్తోంది.
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించడాన్ని స్వాగతించిన రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.
"సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష విరమించడానికి ఇచ్చిన హామీలలో శాంతియుత నిరసనకారులపై ఎలాంటి కేసు నమోదు చేయరని చెప్పారు. అసలు శాంతియుత నిరసన కారులపై కేసులు ఎందుకు పెడతారు?" అని యోగేంద్ర యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ప్రశ్నించారు.
"నిరసనకారుల్లో ఎవరు శాంతియుతంగా ఉన్నారు? ఎవరు లేరో ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇప్పటికే దాఖలైన 11ఎఫ్‌ఐఆర్‌ల సంగతేంటి? నిరాహార దీక్ష ముగిసినంత మాత్రాన ఉద్యమం ముగిసినట్లు కాదని స్పష్టం చేసిన సీజేపీ నాయకులందరికీ వందనం. సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమం కొనసాగుతుందని చెప్పలేదు" అని యోగేంద్ర యాదవ్ అన్నారు.

2023 నాటి ఒక ఫోటోలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సోనమ్ వాంగ్‌చుక్ ఆయన భార్య గీతాంజలి ఆంగ్మోలతో కలిసి ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.
2023 మార్చి నాటి ఆ పోస్ట్‌లో, ధర్మేంద్ర ప్రధాన్ ఆ దంపతుల ఆలోచనలు, విద్యారంగంలో మార్పు తేవాలన్న వారి నిబద్ధతను ప్రశంసించారు.
పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 26వ రోజుకు చేరడంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది.
ఆ సమయంలో వాంగ్‌చుక్ కూడా అంతే ఆప్యాయంగా స్పందించారు. వినూత్న ఆలోచనల పట్ల ధర్మేంద్ర ప్రధాన్ చూపిన ఆసక్తికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశం తర్వాత క్షేత్ర స్థాయిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఆ సమయంలో జాతీయ విద్యా విధానంపై ప్రశ్నలు తలెత్తాయి.

ఫొటో సోర్స్, @JPNadda
సోనమ్ వాంగ్‌చుక్ రాజకీయాలను ఎలా చూడాలి?
ఒక వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్‌లా ఎలా మారగలరు? వాంగ్‌చుక్ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతారు, కానీ సమాధానాలు దొరికే వరకు పోరాడతారా?
"ఒక ఇంజినీర్‌గా, ఆయన ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను సంస్కరించడానికి ప్రయత్నించారు" అని రాజకీయ విశ్లేషకులు మానస్ ఫిరాక్ భట్టాచార్జీ జులై 17న ఫ్రంట్‌లైన్ పత్రికలో రాశారు.
"ఆయన ప్రభుత్వం మీద తిరుగుబాటుదారుడు కాదు. ప్రభుత్వ వ్యతిరేకి కాదు. ఉపన్యాసాలిచ్చేందుకు ప్రజల్లోకి రాలేదు. ఆయనకు ఏ సిద్ధాంతం లేదు. బాధ్యత గల పౌరుడిగా నిబద్ధతతో పని చేయడానికి వచ్చారు" అని ఫిరాక్ భట్టాచార్జీ రాశారు.
"ప్రభుత్వాలు వాంగ్‌చుక్‌లా ఆలోచించవు. ఎందుకంటే, వాళ్లకు రోజువారీ పాలనా వ్యవహారాలు ఉంటాయి. భవిష్యత్ వాళ్లకంత ముఖ్యం కాదు. జవహర్‌లాల్ నెహ్రూ అహ్మద్‌నగర్ జైలులో ఉన్నప్పుడు భారత భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ లెక్కలేనన్ని నిద్రలేని రాత్రులు గడిపారు" అని ఆయన తన వ్యాసంలో తెలిపారు.
"భవిష్యత్తును సీరియస్‌గా పట్టించుకోని ప్రభుత్వం, అలా పట్టించుకునే వారిని చూసి భయపడుతుంది. ఇదే వాంగ్‌చుక్‌ను రాజకీయంగా మారుస్తోంది. పర్యావరణం పట్ల ఆయనకున్న నిబద్ధత విషయంలో ప్రభుత్వ భయం పర్యావరణానికి, మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడుతున్న వారిని కాపాడుతోంది" అని భట్టాచార్జీ రాశారు.

"సోనమ్ వాంగ్‌చుక్‌పై బయోపిక్ తీస్తే, ఆయన పాత్రను ఎవరు పోషిస్తారు" అని లద్దాఖ్ యాక్టివిస్ట్ శ్రింగ్ గఫెల్ ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
"ఒకప్పుడు దేశభక్తుడిగా కీర్తి గడించి, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఒక వ్యక్తి, 'దేశద్రోహి', 'చైనా ఏజెంట్', 'పాకిస్తాన్ ఏజెంట్' అనే ఆరోపణలను ఎదుర్కొన్న కథ ఇది. ఆయన జాతీయ భద్రతా చట్టాన్ని ఎదుర్కొని ఆరు నెలలు జైలులో గడిపారు. ఇప్పుడు భారత ప్రధాని ఆయన ఆరోగ్యంపై బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా అసాధారణమైన కథ. దీనిపై ఒక గొప్ప సినిమా తీయవచ్చు" అని గఫెల్ తన పోస్ట్‌లో రాశారు.
"బీజేపీ నాయకుల సమక్షంలో సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించడం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఉద్యమం సంప్రదాయ, అధికారిక చర్చలకు అతీతమైన ప్రజా భావనను, ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తోంది. వాంగ్‌చుక్‌ను కలవడం మినహా ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట రాయితీలు ఇవ్వకపోవడం, పెల్లెట్ గన్‌ల వాడకంతో సహా పోలీసులు కఠినంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ పరిణామం చాలా మందికి రుచించకపోవచ్చు" అని రాజకీయ విశ్లేషకురాలు సభా నక్వీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
"ఆయన తప్పకుండా నిరాహార దీక్షను విరమించుకోవాల్సింది. అయితే, ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన అభిజీత్ దీప్కే అక్కడ ఉండి అతనికి మొదటి ముద్ద తినిపించి ఉంటే సందేశం వేరేలా ఉండేది."

ఫొటో సోర్స్, @INC
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఎటువైపు వెళ్తుంది?
ఈ ఉద్యమాన్ని గతంలోని అనేక ఉద్యమాలతో పోలుస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని 1974-75 నాటి జేపీ ఉద్యమం 2011-13 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఈ రెండూ ప్రధాన ప్రజా ఉద్యమాలే. వాటిని ఈ రెంటితోనూ పోలుస్తున్నారు.
"ఈ రెంటి కంటే సీజేపీ ఉద్యమం అస్తవ్యస్తంగా ఉంది. ఇది ప్రధానంగా ఆకస్మిక ప్రజాభావన. దీర్ఘకాలంగా ఎదుర్కొన్న అణచివేత, అసంతృప్తి నుంచి బలం పుంజుకుంటోంది. దీని ప్రభావం ఇంకా జాతీయంగా విస్తృతంగా లేదు, అయినప్పటికీ దీని ప్రతిధ్వనులు ఇప్పుడు దిల్లీ దాటి వినిపిస్తున్నాయి" అని రాజకీయ శాస్త్రవేత్త సుహాస్ పల్‌శికర్ ఎక్స్‌లో రాశారు.
"లోక్‌నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో రాజ్యాంగబద్ధ శక్తులు, రాజ్యాంగాన్ని బలహీనపరచాలని కోరుకునే శక్తులు క్రమంగా ఏకమయ్యాయి. ఇది సంప్రదాయ అతివాద శక్తులతో పాటు, ప్రగతిశీల, వామపక్ష వర్గాల కలయిక" అని పల్‌శికర్ విశ్లేషించారు.
"2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం వివాదాస్పద నాయకత్వంతో ప్రారంభమైంది. జేపీ ఉద్యమంలాగే, ఇది కూడా పరస్పర విరుద్ధ భావజాలాలు గల శక్తులను ఏకతాటిపైకి తెచ్చింది. కానీ, అంతిమంగా రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా ఉన్న శక్తుల ప్రభావంలోకి వచ్చింది" అని ఆయన పేర్కొన్నారు.
"జేపీ ఉద్యమం ప్రభుత్వాన్ని ఓడించింది. ఆ తర్వాత పెద్దగా ఏమీ సాధించలేకపోయింది. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అధికారం చేపట్టడానికి మార్గం సుగమం చేసింది. దీనికి విరుద్ధంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం రాజకీయంగా చాలా ఎక్కువ ప్రభావవంతంగా పని చేసింది. ఎందుకంటే, అది ప్రభుత్వ మార్పుకు మార్గం సుగమం చేసింది" అని పల్‌శికర్ రాశారు.
"ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఏ దిశగా సాగుతుంది? బహుశా అది ఎక్కడికీ చేరకపోవచ్చు. అది కేవలం ప్రజల ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది. కాలక్రమేణా దాని శక్తి క్షీణిస్తుంది. రైతుల ఉద్యమంలాగే, ఇది కొంత విజయాన్ని సాధించవచ్చు, కానీ దాని ఊపు క్రమంగా మందగించవచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























