సౌదీ-అమెరికా అణు ఒప్పందం: పాకిస్తాన్ గురించి వ్యక్తమవుతున్న ఆందోళనలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డారియో బ్రుక్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
సౌదీ అరేబియాతో అణు ఒప్పందం కుదిరినట్లు ఇటీవలే అమెరికా ప్రకటించింది.
ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా సహకారంతో సౌదీ అరేబియా తన పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
శాంతియుత ప్రయోజనాల కోసం అణు సహకారానికి సంబంధించిన "అగ్రిమెంట్ 123"పై అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్, సౌదీ అరేబియా ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేశారు.
అణు భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై కూడా ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
"ఈ రెండు ఒప్పందాలు కలిసి అనేక దశాబ్దాల పాటు కొనసాగే, బిలియన్ల డాలర్ల విలువైన భాగస్వామ్యానికి పునాది వేస్తాయి. అణ్వాయుధ వ్యాప్తి నిరోధంతో పాటు ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇవి దోహదపడతాయి" అని వైట్‌హౌజ్ తెలిపింది.

అయితే, ఈ ఒప్పందం పశ్చిమాసియా వంటి సున్నితమైన ప్రాంతంలో అణ్వాయుధ పోటీని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
"ఈ ఒప్పందం అణు భద్రత, అణ్వాయుధ వ్యాప్తి నిరోధంలో అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిశ్చింతగా ఉండొచ్చు.
ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ అణు సాంకేతికత, అమెరికాలో అభివృద్ధి చేసిన అత్యుత్తమ శాస్త్రవేత్తల నైపుణ్యంపై ఆధారపడి ఉంది" అని ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఒప్పందాన్ని సమీక్ష కోసం అమెరికా కాంగ్రెస్‌కు పంపిస్తారు.
ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యాన్ని చేపట్టే కంపెనీల పేర్లను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం, వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ వాటిలో ఒకటిగా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడా లేదు. అయితే 2023 సెప్టెంబరులో ఆ దేశ ఇంధన మంత్రి సౌదీ అరేబియా తొలి అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా ఇంధన సమాచార శాఖ అధికారులు అందుబాటులో ఉంచిన తాజా గణాంకాల ప్రకారం, సౌదీ అరేబియా ఇంధన అవసరాల్లో సుమారు 62 శాతం సహజ వాయువు, 38 శాతం చమురు ద్వారా తీరుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల వాటా ఒక శాతానికి కంటే తక్కువగా ఉంది.
సౌదీ అరేబియా తన దేశంలోనే యురేనియంను శుద్ధి చేసుకునేందుకు అమెరికా అనుమతిస్తే అది అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామమని మధ్యప్రాచ్య వ్యవహారాల నిపుణురాలు రోజ్మేరీ కలానిక్ అన్నారు.
"అమెరికా ఇప్పటివరకు ఇలా ఎప్పుడూ చేయలేదు. మరో దేశం తన సొంత భూభాగంలో యురేనియంను శుద్ధి చేసుకోవడానికి మేమెప్పుడూ సహాయం చేయలేదు" అని ఆమె బీబీసీతో చెప్పారు.
"ఒక దేశం తన అణు ఇంధనాన్ని తానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని సంపాదిస్తే, అది అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రమాదం బాగా పెరుగుతుంది" అని కలానిక్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు
ఈ ఒప్పందానికి సంబంధించిన అనధికార సమాచారం గత బుధవారం ఉదయం నుంచే బయటకు రావడం ప్రారంభమైంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత అమెరికాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి.
సౌదీ అరేబియా అణుశక్తిని కేవలం శాంతియుత ప్రయోజనాలకు, విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం చేస్తే తమ దేశానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బర్కత్ అన్నారు.
"ఇజ్రాయెల్ భద్రతను అమెరికా ప్రమాదంలో పడనివ్వదు. ప్రధానమంత్రి నెతన్యాహు, అధ్యక్షుడు ట్రంప్‌లకు అలాంటి విషయాలను ప్రమాదాలు లేకుండా ఎలా నిర్వహించాలో తెలుసు" అని ఆయన ఇజ్రాయెల్ సైనిక రేడియోకు చెప్పారు.
అయితే ఇజ్రాయెల్ మాజీ రక్షణ, విదేశాంగ మంత్రి అవిగ్డోర్ లీబర్మన్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. "సౌదీ అరేబియా పౌర అణు కార్యక్రమం చివరికి అణ్వాయుధ కార్యక్రమంగా మారుతుంది" అని ఆయన ఎక్స్‌లో రాశారు.
దీంతో మధ్యప్రాచ్యం అంతటా అణ్వాయుధ పోటీ మొదలవుతుందని అది "అదుపు లేని ఆయుధ పోటీ"గా మారుతుందని ఆయన హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోనూ భిన్నాభిప్రాయాలు
ఈ ఒప్పందంపై అమెరికా రాజకీయ నాయకుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
2009లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో కుదిరిన అణు ఒప్పందం తరహాలో కఠినమైన భద్రత, అణ్వాయుధ వ్యాప్తి నిరోధ నిబంధనలు ఉంటేనే ఇలాంటి ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలపాలని కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అన్నారు.
ఆ 2009 ఒప్పందం ప్రకారం యూఏఈ తన దేశంలో యురేనియం శుద్ధి చేసుకోవడానికి అనుమతి లేదు.
"మధ్యప్రాచ్యంలో అణ్వాయుధ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యే అధ్యక్షుడు, అమెరికా కంపెనీలకు లాభం చేకూరుతుందనే కారణంతో అణ్వాయుధ వ్యాప్తిని ప్రోత్సహించకూడదు" అని షెర్మన్ ఎక్స్‌లో రాశారు.
డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు జాన్ గారమెండీ కూడా ఈ ఒప్పందాన్ని విమర్శించారు. దీనిని "అత్యంత చెడ్డ విధానం"గా అభివర్ణించిన ఆయన, "ఇలాంటి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు" అన్నారు.
"శుద్ధి చేసిన యురేనియాన్ని అణ్వాయుధాల తయారీకి ఉపయోగించవచ్చు. ఇది నిజంగా చాలా చెడ్డ విధానం" అని ఆయన సీఎన్ఎన్కు చెప్పారు.
మరోవైపు ప్రస్తుతం ఈ ఒప్పందంపై తనకు ప్రాథమికంగా ఎలాంటి ఆందోళనలు లేవని, అయితే దీనిపై నిఘా సంస్థల నుంచి మరింత సమాచారం తెలుసుకోవాలని ఉందన్నారు, రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు మార్లిన్ స్టట్జ్మన్
"మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని కొనసాగించడంలో సౌదీ అరేబియా నిజంగా కీలకమైన దేశం" అని ఆయన సీఎన్ఎన్కు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పడు సౌదీ అరేబియా అణ్వాయుధాన్ని నిర్మిస్తుందా అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో సమాధానం కాదు అనే చెప్పుకోవాలి. కనీసం ప్రస్తుతం అలాంటి సూచనలేవీ లేవు. అయితే ఈ ఒప్పందంపై ఉన్న అతిపెద్ద ఆందోళన కూడా ఇదే.
ఇరాన్ తన దేశంలోనే యురేనియంను శుద్ధి చేసింది. దాని పరిణామాలను ప్రపంచం చూసింది.
అమెరికా ఉపగ్రహాల నిఘాకు దూరంగా, ఎడారి పర్వతాల్లోని తన కేంద్రాల్లో ఇరాన్ 441 కిలోల యురేనియంను 60 శాతం వరకు శుద్ధి చేసింది. పౌర అణు విద్యుత్ కేంద్రాలకు అవసరమైన 3.67 శాతం కంటే ఇది చాలా ఎక్కువ. అణ్వాయుధ తయారీకి అవసరమైన సుమారు 90 శాతం స్థాయికి ఇది కేవలం ఒక అడుగు దూరంలోనే ఉందని భావిస్తారు.
నిరుడు అమెరికా నిర్వహించిన "ఆపరేషన్ మిడ్నైట్ హామర్" దాడిలో బాంబులు వేసిన సొరంగాల్లో ఈ శుద్ధి చేసిన యురేనియం ఇప్పటికీ ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం సౌదీ అరేబియా ఇరాన్ మార్గంలో నడవాలని లేదా తన ప్రారంభ దశలో ఉన్న పౌర అణు కార్యక్రమాన్ని సైనిక అవసరాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు ఎలాంటి సంకేతాలు లేవు.
అయితే సౌదీ అరేబియా నిరంతర భద్రతా సవాళ్లు ఉన్న ప్రాంతంలో భాగంగా ఉంది. భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలను సంపాదిస్తే, తన భద్రత, నిరోధక సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి సౌదీ అరేబియా కూడా అలాంటి ఆయుధాలను సంపాదించాలని ప్రయత్నించే అవకాశం ఉంది.
అయితే యురేనియంను 90 శాతం వరకు శుద్ధి చేసి, అంతర్జాతీయ చట్టాల ప్రకారం అక్రమమైన, సుదీర్ఘమైన, సంక్లిష్టమైన అణ్వాయుధ అభివృద్ధి ప్రక్రియను అనుసరించడానికి బదులుగా, సిద్ధంగా ఉన్న అణ్వాయుధాలను తన సన్నిహిత మిత్రదేశమైన పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా పొందే అవకాశం కూడా ఉంది.
ఇది ఏళ్ల తరబడి చర్చల తర్వాత కుదిరిన ఒప్పందం
అమెరికా, సౌదీ అరేబియా మధ్య అణు సహకార చర్చలు 2008లో ప్రారంభమయ్యాయి.
అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఇరు దేశాలు చట్టబద్ధత లేని అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దాని ప్రకారం సౌదీ అరేబియాలో పౌర అణుశక్తి కార్యక్రమం అభివృద్ధికి అమెరికా సహకరిస్తామని హామీ ఇచ్చింది.
ఆ సమయంలో సౌదీ అరేబియా అణు ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటామని, సున్నితమైన అణు సాంకేతికతను సొంతం చేసుకునే ప్రయత్నం చేయబోమని తెలిపింది.
ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రధాన పరిణామాలు ఇవి.
2017 నుంచి 2019 మధ్య పౌర అణుశక్తి రంగంలో సౌదీ అరేబియాతో చర్చలు జరిపేందుకు ఏడు అమెరికా కంపెనీలకు అమెరికా అనుమతి ఇచ్చింది.
2020లో అమెరికా ప్రభుత్వ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో, యురేనియం శుద్ధి వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాల కారణంగా చర్చల్లో గణనీయమైన పురోగతి లేదని పేర్కొంది.
2022లో అణు భద్రత, సాంకేతిక సమాచార మార్పిడికి సంబంధించిన కొత్త అవగాహన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
2023లో అమెరికా పర్యవేక్షణలో సౌదీ అరేబియాలో యురేనియం శుద్ధి ప్రాజెక్టును ప్రారంభించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
2025 నవంబరులో ఇరు దేశాలు సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశాయి. దీనిని ట్రంప్ ప్రభుత్వం మల్టీ బిలియన్ డాలర్ల అణుశక్తి భాగస్వామ్యానికి చట్టపరమైన పునాదిగా అభివర్ణించింది.
ఇటీవలి సంవత్సరాల్లో అమెరికా, సౌదీ అరేబియా సంబంధాల్లో గణనీయమైన మార్పు వచ్చింది.
సుమారు నాలుగేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సమావేశమైనప్పుడు ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఎందుకంటే అంతకుముందు బైడెన్ సౌదీ అరేబియాను ప్రపంచంలో ఒంటరి దేశంగా మార్చాలని పిలుపునిచ్చారు. తుర్కియేలో అమెరికాలో నివసిస్తున్న పాత్రికేయుడు, ప్రభుత్వ విమర్శకుడు జమాల్ ఖషోగ్జీ హత్య, మృతదేహాన్ని ముక్కలుగా చేయాలని యువరాజే ఆదేశించారని అమెరికా నిఘా సంస్థలు తేల్చిన తర్వాత బైడెన్ ఆ వ్యాఖ్యలు చేశారు.
అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో, చమురు మార్కెట్‌ను మళ్ళీ స్థిరమైన పరిస్థితికి తెచ్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఒకటైన సౌదీ అరేబియా సహకారాన్ని బైడెన్ కోరారు.
ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో ఇద్దరు నాయకులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. క్రమంగా ఇరు దేశాల సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరి, సహకారం పెరిగింది.
మళ్లీ వైట్‌హౌజ్‌కు వచ్చిన తర్వాత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాతో సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2025 మేలో ఆయన చేసిన తొలి ప్రధాన విదేశీ పర్యటనల్లో ఒకటి సౌదీ అరేబియాకే. ఈ పర్యటనలో అమెరికాలో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ కంపెనీలు సిద్ధమయ్యాయి.
గత నవంబరులో ట్రంప్ వైట్‌హౌజ్‌లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు ఘన స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలకడంతో పాటు సైనిక వైమానిక విన్యాసాలు నిర్వహించారు. అధ్యక్ష భవనాన్ని ప్రత్యేకంగా చూపించారు.
సౌదీ నాయకత్వాన్ని ట్రంప్ తరచుగా బహిరంగంగా ప్రశంసిస్తుంటారు. జో బైడెన్ హయాంలో అమెరికా "డెడ్ కంట్రీగా" అంటే దేశం చనిపోయిందని సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ తనతో చెప్పారని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.
ఇటీవలి నెలల్లో ప్రాంతీయ ఉద్రిక్తతలకు కూడా సౌదీ అరేబియా కేంద్రంగా మారింది. ఇరాన్ నుంచి దాడులు జరిగే అవకాశం, ఇరాన్‌పై అమెరికా దాడులు సౌదీ అరేబియా ఇంధన ఎగుమతులపై ప్రభావం చూపాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























