గుండెకు స్టంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?

గుండె, ఆరోగ్యం, చికిత్స, రోగులు, ఆస్పత్రులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

గుండె సమస్యల విషయంలో మనకు సమాచారం తెలిసే కొద్దీ అపోహలు కూడా పెరుగుతాయి.

యాంజియోప్లాస్టీ చేయించుకుని స్టంట్ అమర్చుకున్న తర్వాత తమ గుండె జబ్బు నయమైనట్టుగా భావిస్తారు. అయితే గుండె జబ్బుకు కారణమయ్యే అంతర్లీన ప్రక్రియను స్టంట్ ఆపదు. స్టంట్ రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకిని మాత్రమే తొలగిస్తుంది.

స్టంట్ ఏర్పాటుచేసుకున్న తర్వాత కూడా శరీరంలోని ఇతర రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోవడం ఆగకపోవచ్చు.

యాంజియోప్లాస్టీ తర్వాత కూడా రోగి తన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్టంట్‌ వేసుకున్న తర్వాత అన్ని సమస్యలు తీరిపోయినట్టేనని..ఇప్పుడు ఏం చేసినా ఏమీ కాదని అనుకోకూడదు.

స్టంట్లు అమర్చుకున్న రోగులు భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మరింత అప్రమత్తంగా ఉండాలి .

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘అంతా బాగున్నట్టే అని అనుకోకూడదు’

గుండెపోటు వచ్చిన లేదా స్టంట్ అమర్చుకున్న రోగులకు మిగిలినవారితో పోలిస్తే మరోసారి గుండెపోటు, పక్షవాతం లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ , రక్తపోటు, రక్తంలో చక్కెర, బరువు, మూత్రపిండాల పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం అవసరం.

దీంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, మద్యం, పొగాకుకు పూర్తిగా దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కూడా అంతే ముఖ్యం.

అందుకే యాంజియోప్లాస్టీ తర్వాత రోగులు కచ్చితంగా ఏం చేయాలి, క్రమం తప్పకుండా ఏ పరీక్షలు చేయించుకోవాలి, ఏ లక్షణాలను ప్రమాదకరంగా భావించాలి వంటివి తెలుసుకుందాం.

గుండె, ఆరోగ్యం, చికిత్స, రోగులు, ఆస్పత్రులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టంట్ అనేది గుండె జబ్బులకు శాశ్వత నివారణ కాదని వైద్యనిపుణులు చెప్పారు.

అసలు స్టంట్ అంటే ఏంటి?

యాంజియోప్లాస్టీ సమయంలో అమర్చే స్టంట్ అనేది బాగా పలుచగా ఉండే జాలీలాంటి లోహపు గొట్టం.

అడ్డంకి కారణంగా ఇరుకైన ప్రాంతాన్ని బెలూన్ సాయంతో వెడల్పు చేసిన తర్వాత, కరోనరీ ధమనిలో స్టంట్‌ను అమరుస్తారు.

రక్తనాళం మళ్లీ సన్నబడకుండా గుండెకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చూడటం దీని పని.

ఈ రోజుల్లో చాలా చోట్ల డ్రగ్-ఎల్యూటింగ్ స్టెంట్లను (డీఈఎస్) ఉపయోగిస్తున్నారు. ఈ స్టంట్లకు నిర్దుష్ట మందులతో పూత ఉంటుంది. ఈ పూతలు రక్తనాళం లోపలి పొరలో అదనపు కణజాలం పెరగడాన్ని తగ్గించడానికి, మళ్లీ ఇరుకుగా మారే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

స్టంట్ అనేది గుండె జబ్బులకు శాశ్వత నివారణ కాదు. ఇది కేవలం అడ్డంకి ఉన్న ప్రాంతానికి మాత్రమే చికిత్స చేస్తుంది. కాబట్టి స్టంట్ అమర్చిన తర్వాత కూడా కొలెస్ట్రాల్ నియంత్రణ, రక్తపోటు, మధుమేహం, వ్యాయామం, ఆహారం, మందుల విషయంలో శ్రద్ధ అవసరం.

స్టంట్ ఆపరేషన్ సక్సెస్ కావడమన్నది కేవలం దానిని అమర్చడంపైనే కాకుండా, ఆ తర్వాత దీర్ఘకాలిక పర్యవేక్షణ, జీవనశైలి మార్పులపై కూడా ఆధారపడి ఉంటుంది.

గుండె, ఆరోగ్యం, చికిత్స, రోగులు, ఆస్పత్రులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టంట్ అమర్చిన తర్వాత రక్తనాళం మళ్లీ ఇరుగ్గా మారే ప్రమాదం తగ్గుతుంది.

స్టంట్ వేయించుకుంటే గుండె జబ్బు నయమైనట్టేనా?

స్టంట్ అమర్చిన తర్వాత కూడా భవిష్యత్తులో కొత్త అడ్డంకులు ఏర్పడవచ్చు లేదా ఇతర రక్తనాళాల్లో సమస్యలు తలెత్తవచ్చు.

అందుకే హృద్రోగ నిపుణులు 'ద్వితీయ నివారణ'కు ప్రాధాన్యత ఇస్తారు. అంటే రెండో గుండెపోటు లేదా ఇతర తీవ్రమైన సమస్యలను నివారించడానికి ప్రమాద కారకాలను నియంత్రించడం.

దీనిలో భాగంగా ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను ఒక నిర్దిష్ట లక్ష్య స్థాయికి తీసుకురావడం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, ఒకవేళ మధుమేహం ఉంటే దానికి చికిత్స చేయించుకోవడం, డాక్టర్ సూచించిన రక్తాన్ని పల్చబరిచే మందులు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం వంటివి ఉంటాయి.

గుండె, ఆరోగ్యం, చికిత్స, రోగులు, ఆస్పత్రులు

ఫొటో సోర్స్, Getty Images

యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ, యాంజినా, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏంటి?

గుండె జబ్బుల గురించి మాట్లాడేటప్పుడు యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ, యాంజినా, ఓపెన్ హార్ట్ సర్జరీ అనే పదాలు తరచుగా వినిపిస్తుంటాయి. ఈ పదాలపై రోగులకు, వారి కుటుంబ సభ్యులకు గందరగోళం ఉంటుంది. ఈ నాలుగింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ముఖ్యం.

యాంజినా

గుండె కండరానికి రక్త సరఫరా సరిపోకపోవడం వల్ల ఛాతీలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, నొప్పి లేదా అసౌకర్యంగా ఉండటాన్ని యాంజినా అంటారు. ఇది స్వతహాగా ఒక వ్యాధి కాదు గానీ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనులు సన్నబడటానికి లేదా మూసుకుపోవడానికి ఇది ఒక సంకేతం కావచ్చు. నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు తీవ్రతరం కావచ్చు.

కరోనరీ యాంజియోగ్రఫీ

ఇది ఒక నిర్ధారణ పరీక్ష. చేయి లేదా తొడలోని సిర ద్వారా ఒక సన్నని గొట్టాన్ని (కాథెటర్) చొప్పించి, కరోనరీ ధమనులలోకి కాంట్రాస్ట్ డైని ఇంజెక్ట్ చేస్తారు. ధమనుల్లో అడ్డంకి ఉందో లేదో చూడటానికి ఎక్స్-రే తీస్తారు. యాంజియోగ్రఫీ ద్వారా అడ్డంకి స్థానాన్ని, తీవ్రతను నిర్ధరించవచ్చు.

యాంజియోప్లాస్టీ

యాంజియోగ్రఫీ సమయంలో రక్తనాళంలో అడ్డంకిని గుర్తిస్తే కొంతమంది రోగులకు యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ చికిత్సలో రక్తనాళాన్ని వెడల్పు చేయడానికి అడ్డంకిపై ఒక చిన్న బెలూన్‌ను ఉబ్బించి, దానిని తెరిచి ఉంచడానికి ఒక స్టంట్‌ను అమరుస్తారు. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఈ చికిత్సను ఉపయోగిస్తారు.

ఓపెన్ హార్ట్ సర్జరీ / బైపాస్ సర్జరీ (సీఏబీజీ)

అడ్డంకులు తీవ్రంగా ఉన్నప్పుడు, లేదా యాంజియోప్లాస్టీ సాధ్యం కానప్పుడు, బైపాస్ సర్జరీని పరిగణిస్తారు. ఈ శస్త్రచికిత్సలో అడ్డంకిని దాటవేసే కొత్త రక్త ప్రవాహ మార్గాన్ని సృష్టించడానికి శరీరంలోని ఇతర రక్తనాళాలను ఉపయోగిస్తారు. బైపాస్ సర్జరీ అనేది ఒక రకమైన ఓపెన్ హార్ట్ సర్జరీ.

సంక్షిప్తంగా చెప్పాలంటే యాంజినా అనేది లక్షణం, యాంజియోగ్రఫీ అనేది రోగ నిర్ధారణ పరీక్ష, యాంజియోప్లాస్టీ అనేది చికిత్స, మరింత సంక్లిష్టమైన అడ్డంకులకు బైపాస్ సర్జరీ అనేది శస్త్రచికిత్సా విధానం.

గుండె, ఆరోగ్యం, చికిత్స, రోగులు, ఆస్పత్రులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...

యాంజియోప్లాస్టీ చేయించుకున్న రోగులు తమ భవిష్యత్తు జీవితంలో పాటించాల్సిన నియమాలు, అలాగే రోగి, వారి కుటుంబ సభ్యులు నివృత్తి చేసుకోవాల్సిన సందేహాల గురించి డాక్టర్ పారిన్ సంగోయ్‌తో మాట్లాడాం. డాక్టర్ సంగోయ్ ముంబై సెంట్రల్‌లోని వోక్‌హార్డ్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయన బీబీసీ అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇచ్చారు.

యాంజియోప్లాస్టీ చేయించుకునే రోగులు ఏ పరీక్షలు చేయించుకోవాలి, వారి ఆరోగ్యాన్ని ఎలా పర్యవేక్షించుకోవాలి అని అడగ్గా డాక్టర్ పారిన్ సంగోయ్ ఇలా చెప్పారు.

"ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి, ప్రమాదాలను బట్టి పరీక్షల షెడ్యూల్ మారుతూ ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి" అని చెప్పారు.

‘‘రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గించే మందులను వాడటం మొదలుపెట్టిన లేదా మార్చిన కొన్ని నెలల తర్వాత లిపిడ్ ప్రొఫైల్‌ను చెక్ చేయించుకోవాలి. మధుమేహం ఉన్న రోగులు వైద్యుని సలహా మేరకు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర, హెచ్‌బీఏ1సీ పరీక్షలు చేయించుకోవాలి.

మధుమేహం, అధిక రక్తపోటు, లేదా ముందు నుంచే మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులకు మూత్రపిండాల పనితీరు పరీక్షలు చాలా ముఖ్యమైనవి. బరువు, నడుము చుట్టుకొలత, జీవనశైలి అలవాట్లను కూడా అంచనా వేయాలి. ఇవి దీర్ఘకాలిక ఫలితాలను ప్రభావితం చేస్తాయి’’ అని డాక్టర్ సంగోయ్ చెప్పారు.

ఇప్పటికే గుండెపోటు వచ్చిన లేదా యాంజియోప్లాస్టీ చేయించుకున్న రోగులకు లక్ష్యిత ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి ఎంత ఉండాలి?

"గుండెపోటు వచ్చిన యాంజియోప్లాస్టీ చేయించుకున్న రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి రోగుల విషయంలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి 55 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి.

గుండెకు మేలు చేసే ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, కొలెస్ట్రాల్‌ను తగ్గించే మంచి మందులు అవసరం. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎంత తక్కువగా ఉంటే, భవిష్యత్తులో గుండెపోటు లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం అంత తక్కువగా ఉంటుంది" అని డాక్టర్ పరిన్ సంగోయ్ చెప్పారు.

యాంజియోప్లాస్టీ తర్వాత రోగులందరూ క్రమం తప్పకుండా ఈసీజీ, 2డీ ఎకో, టీఎంటీ, సీటీ యాంజియోగ్రఫీ లేదా రీ-యాంజియోగ్రఫీ చేయించుకోవాలా? ఏ పరీక్షలు అవసరమో ఎలా నిర్ణయిస్తారు? అని అడగ్గా డాక్టర్ పారిన్ సంగోయ్ ఇలా అన్నారు.

"ఫాలో-అప్ పరీక్షలను రోగి లక్షణాలు, వైద్య పరీక్ష, మొత్తం ప్రమాదం ఆధారంగా నిర్ణయిస్తారు. వాటిని క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం లేదు.

రోగి పరిస్థితిని బట్టి ఈసీజీ, 2డీ ఎకోకార్డియోగ్రఫీని సూచించవచ్చు. గుండెకు రక్త ప్రవాహం తగ్గినట్టు సంకేతాలు ఉంటే స్ట్రెస్ టెస్ట్ (టీఎంటీ)ని పరిగణిస్తారు'' అని చెప్పారు.

గుండె, ఆరోగ్యం, చికిత్స, రోగులు, ఆస్పత్రులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాంజియోప్లాస్టీ తర్వాత రోగి నిరంతరం తనను తాను గమనించుకుంటూఉండాలని వైద్యులు చెప్పారు.

'దినచర్య'ను ఎప్పుడు ప్రారంభించడం మంచిది?

యాంజియోప్లాస్టీ విజయవంతమైన తర్వాత సీటీ యాంజియోగ్రఫీ లేదా పునరావృత కరోనరీ యాంజియోగ్రఫీని సాధారణంగా సిఫార్సు చేయరు. ఛాతీ నొప్పి తిరిగి వస్తే, లక్షణాలు తీవ్రమైతే, లేదా పరీక్ష సమయంలో ఏవైనా అనుమానాస్పద విషయాలు కనిపిస్తే మాత్రమే ఈ పరీక్షలను పరిగణిస్తారు.

యాంజియోప్లాస్టీ తర్వాత కూడా అసాధారణ లక్షణాలు ఏమైనా ఉంటాయేమో రోగి తమను తాము నిరంతరం గమనించుకోవడం ముఖ్యం.

ఛాతీ నొప్పి వస్తే దానిపై మరింత శ్రద్ధ పెట్టడం ముఖ్యం అని డాక్టర్ ఆనంద్ రావు అంటున్నారు. డాక్టర్ ఆనంద్ రావు ముంబైలోని పీడీ. హిందూజ, ఎంఆర్‌సీ ఆసుపత్రుల్లో సీనియర్ కన్సల్టెంట్-ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

యాంజియోప్లాస్టీకి ముందులా ఛాతీ నొప్పి వస్తే, దానిని తీవ్రంగా పరిగణించాలని ఆయన అంటున్నారు. ఈ లక్షణం అంతర్గత సమస్యకు సూచన కావచ్చని, దీనికి తక్షణ వైద్య పరీక్ష అవసరం కావచ్చని తెలిపారు.

యాంజియోప్లాస్టీ అనంతర కాలంలో తలెత్తే ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

యాంజియోప్లాస్టీ తర్వాత రోగి 'రొటీన్'‌ను ఎప్పుడు ప్రారంభించాలి?

యాంజియోప్లాస్టీ తర్వాత రోగులు విధులు, ప్రయాణం, వ్యాయామం,ఇతర రోజువారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలి అనేదానికి సమాధానం ప్రధానంగా గుండె పంపింగ్ సామర్థ్యంపై, ముఖ్యంగా ఎడమ జఠరిక పనితీరుపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ ఆనంద్‌రావు తెలిపారు.

‘‘గుండె పనితీరు సాధారణంగా ఉంటే వారం నుంచి పది రోజుల్లోగా తిరిగి విధుల్లోకి వెళ్ళవచ్చు. క్రమం తప్పకుండా నడవడంతో ప్రారంభించి, మరింత క్రమమైన వ్యాయామానికి మారొచ్చు’’ అని సూచించారు.

ఈ సమయంలో ప్రయాణం కూడా చేయవచ్చన్నారు. రోగి గుండె పంపింగ్ సామర్థ్యం గణనీయంగా తగ్గినా లేదా ఎడమ జఠరిక ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉన్నా వారికి మరింత వైద్య పర్యవేక్షణ అవసమని తెలిపారు.

గుండె, ఆరోగ్యం, చికిత్స, రోగులు, ఆస్పత్రులు

ఫొటో సోర్స్, Getty Images

యాంజియోప్లాస్టీ తర్వాత సెక్స్ సంగతేంటి?

యాంజియోప్లాస్టీ తర్వాత లైంగిక జీవితం తిరిగి ప్రారంభించే సమయం ప్రధానంగా గుండె పంపింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ ఆనంద్ రావు చెప్పారు.

‘‘గుండె పనితీరు సాధారణంగా ఉంటే చాలా మంది రోగులు శస్త్రచికిత్స జరిగిన 10 నుంచి 15 రోజుల తర్వాత సురక్షితంగా లైంగిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చు. అయితే గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గితే రోగులు ముందుగా కార్డియాక్ రిహాబిలిటేషన్ లేదా ఫిజియోథెరపీ చేయించుకోవడం ద్వారా కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవాలి. లైంగిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ముందు కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి’’ అని చెప్పారు.

గుండె పంపింగ్ సామర్థ్యం భాగా తగ్గినట్టయితే ఆ పరిస్థితి మెరుగయ్యే వరకు ఎక్కువ శారీరక శ్రమతో కూడిన లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)