‘‘ఒత్తిడి నుంచి బయటపడేందుకు చింపాంజీలు ముద్దు పెట్టుకుంటాయి, కౌగిలించుకుంటాయి’’

కోతులు, చింపాజీలు, మనుషుల మధ్య భావనలు, పరిశోధన

ఫొటో సోర్స్, Jake Brooker / Chimfunshi Wildlife Orphanage Trust

ఫొటో క్యాప్షన్, ఒక జంతు సంరక్షణ కేంద్రంలో 'లిటిల్ జేక్', 'లిటిల్ జోయీ' అనే రెండు మగ చింపాంజీలు ఆలింగనం చేసుకుంటున్న దృశ్యం.
    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఒత్తిడితో కూడిన పరిస్థితులకు ముందు ఒకరినొకరు తాకడం, ఆలింగనం చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం ద్వారా నమ్మకం పెంచుకోవడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సామాజిక ప్రవర్తన కావచ్చని, మనకు అత్యంత దగ్గరి బంధుత్వం ఉన్న వానర జాతులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆహారం కోసం పోటీ పడే సందర్భాలకు ముందు చింపాంజీలు, బోనోబోలు శారీరక స్పర్శ ద్వారా ఒకదానికొకటి ఎలా ధైర్యం ఇచ్చుకుంటాయో డర్హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పరిశీలించారు.

ఈ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దూకుడు స్వభావానికి పేరున్న చింపాంజీలు సైతం ఒకదానితో ఒకటి అత్యంత సన్నిహితంగా మెలిగాయి.

వేళ్లను ఒకదాని నోటిలోకి మరొకటి పెట్టడం వంటి ప్రవర్తన కూడా కనిపించింది.

"ఒత్తిడితో కూడిన పరిస్థితులకు ముందు అవన్నీ ఒకచోట చేరతాయి. ఒకదానికొకటి ధైర్యం చెప్పుకుంటాయి. తాకుతాయి. ఆలింగనం చేసుకుంటాయి" అని ప్రొఫెసర్ జానా క్లే తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పెద్ద మ్యాచ్‌కు ముందు ఫుట్‌బాల్ ఆటగాళ్లు గ్రూపుగా చేరి ఉత్సాహం నింపుకునే విధానాన్ని పోలిన చర్యగా జానా క్లే దీన్ని అభివర్ణించారు. "ఇది 'నేను' కంటే 'మనం' అనే భావనను ప్రతిబింబిస్తుంది" అని ఆమె అన్నారు.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జాంబియాలోని రెండు జంతు సంరక్షణ కేంద్రాల్లో నివసిస్తున్న చింపాంజీలు, బోనోబోలను ఈ నిపుణులు అధ్యయనం చేశారు.

అడవిలో సహజంగా ఆహారం సేకరించే పరిస్థితిని పోలి ఉండేలా వేరుశెనగలు ఉపయోగించి ప్రయోగం రూపొందించారు.

కోతులు, చింపాజీలు, మనుషుల మధ్య భావనలు, పరిశోధన

ఫొటో సోర్స్, Zanna Clay / Lola ya Bonobo Sanctuary

ఫొటో క్యాప్షన్, ఒక గొడవలో బెదిరింపునకు గురైన ఒశ్వే అనే చిన్న మగ బోనోబోను షిబో అనే మరో చిన్న మగ బోనోబో ఓదారుస్తూ కౌగిలించుకుంది.

నమ్మకం, సహకారం పెంచడంలో స్పర్శ పాత్ర

వేరుశెనగలు ఇవ్వడానికి ముందు ఐదు నిమిషాల పాటు వానరాలను పరిశీలించారు. ఆహారం రాబోతోందని వాటికి ముందే తెలుసు. ఈ సమయంలో అవి తాకడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడంతో సహా ఒకదానికొకటి ధీమా ఇచ్చుకునే శారీరక స్పర్శకు సంబంధించిన సందర్భాలను పరిశోధకులు రికార్డు చేశారు.

ఒకదానినొకటి తాకుకున్నవి, ఆలింగనం చేసుకున్నవి ఆహారం పొందడంలో ఎక్కువ విజయవంతమయ్యాయని, ప్రశాంతంగా పక్కపక్కనే కూర్చొని ఆహారం తిన్నాయని పరిశోధక బృందం గుర్తించింది.

ఎక్కువ సహనంతో ఉండే గుంపుల్లో ఇలాంటి ధైర్యం చెప్పే స్పర్శలు మరింత ఎక్కువగా కనిపించాయి. వరుసగా అనేక వానరాలు ఒకదానినొకటి ఆలింగనం చేసుకునే విధానాన్ని పరిశోధకులు "రీయష్యూరెన్స్ ట్రెయిన్స్"గా పేర్కొన్నారు.

"మనకు అత్యంత సమీప జీవులైన బోనోబోలు, చింపాంజీలను పోల్చి చూడటం వల్ల సామాజిక ప్రవర్తన ఎలా రూపుదిద్దుకుందో, అలాగే ఉద్రిక్తత, పోటీ, సహకారాన్ని వానరాలు, మనుషులు ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది" అని డాక్టర్ జేక్ బ్రూకర్ చెప్పారు.

70 లక్షల ఏళ్ల నాటిది..

సామాజిక స్పర్శ అనేది సమాచార మార్పిడిలో అత్యంత ప్రాచీన రూపాల్లో ఒకటని, భాష పుట్టుక కంటే ముందే అది ఉనికిలోకి వచ్చి ఉండొచ్చని బ్రూకర్ అభిప్రాయపడ్డారు.

మనుషులు, చింపాంజీలు, బోనోబోలు ఉమ్మడి పూర్వీకుల నుంచి విడిపోకముందే, అంటే కనీసం 70 లక్షల ఏళ్ల కిందటే... నమ్మకం, సహకారం పెంచేందుకు స్పర్శను వినియోగించే అలవాటు ఉండి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అందువల్ల ఒత్తిడితో కూడిన పరిస్థితికి ముందు మనుషులు ఫుట్‌బాల్ ఆటగాళ్లలా గుంపుగా చేరడం, సహచరుణ్ని ఆలింగనం చేసుకోవడం, భుజంపై తట్టడం వంటి చర్యలు లక్షలాది ఏళ్లుగా కొనసాగుతున్న సామాజిక సంప్రదాయంలో భాగమే కావచ్చని వారు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)