ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇషాద్రితా లాహిడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక పెద్ద యూ-టర్న్‌గా పరిగణిస్తున్నారు.
ఎందుకంటే మొదట్లో ప్రభుత్వం నిరసనకారులతో చర్చలకు నిరాకరించడమే కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌కు కూడా సానుకూలంగా లేదు. ఈ పరిణామం అత్యంత అసాధారణమైనదిగా భావించడానికి కారణం మోదీ ప్రభుత్వ పన్నెండేళ్ల పాలనలో ప్రజల ఒత్తిడితో ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే మొదటిసారి కావడం.
గతంలో 2018లో మీటూ (మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం) ఆరోపణల తర్వాత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేశారు. నిరసనల ఒత్తిడికి తలొగ్గి గతంలో ప్రభుత్వం 2021లో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. ఇది అతిపెద్ద విధాన నిర్ణయం.
అదే సమయంలో 2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయిగానీ అప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
మరి ఈసారి నిరసనకారుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గడానికి కారణమేంటి? ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడానికి రాజకీయ విశ్లేషకులతో బీబీసీ మాట్లాడింది.


ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN / AFP via Getty Images

బీబీసీతో మాట్లాడిన చాలామంది రాజకీయ విశ్లేషకులు ఈ ఉద్యమం ఊహించని స్థాయిలో జరగడం ప్రభుత్వానికి ఒక ప్రధాన ఆందోళనగా మారిందని భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ఉద్యమం కొన్నివారాల్లోనే దేశమంతా వ్యాపించింది. కొద్దిరోజులుగా అనేక నగరాల్లో భారీ నిరసనలు కనిపించాయి.
మోదీ ప్రభుత్వం తన రాజకీయ విశ్వసనీయత క్రమంగా బలహీనపడుతోందని భావించిందని రాజకీయ విశ్లేషకురాలు అదితీ ఫడ్నిస్ అంటున్నారు.
"దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విషయం. మోదీ ప్రభుత్వం 2024లో సంపూర్ణ మెజారిటీ లేకుండానే తిరిగి అధికారంలోకి వచ్చింది. దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి నిర్దిష్ట వ్యూహం లేదు. ఈ ఉద్యమానికి ప్రధాన వేదికగా మారిన సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు, కథనాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఈ పరిస్థితికి సిద్ధంగా లేదు" అని విశ్లేషించారు.
జేఎన్‌యూలో రాజకీయ అధ్యయనాల కేంద్రానికి చెందిన ప్రొఫెసర్ హరీశ్ వాంఖేడే కూడా ఈ ఉద్యమం విస్తృత స్వభావం కారణంగానే ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరిందని అభిప్రాయపడ్డారు.
"ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇది దిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. యువతను తన ముఖ్యమైన ఓటు బ్యాంకుగా భావించిన ప్రభుత్వం, వారు ఇంత తీవ్రంగా స్పందిస్తారని ఊహించలేదు. ప్రధానమంత్రి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తర్వాత కూడా ప్రజల ఆగ్రహం తగ్గలేదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI

ప్రతిష్టంభనను త్వరగా ముగించాలని ప్రభుత్వం కోరుకోవడానికి పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలు కూడా ఒక కారణమని సీనియర్ రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌధరి అంటున్నారు.
"ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆశించింది. కానీ ఈ వివాదం వల్ల అది వాయిదా పడింది. డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం చాలా కాలంగా భావిస్తోంది. దానిని ఈ సమావేశాల్లో ఆమోదించాలని కోరుకుంది" అని ఆమె అన్నారు.
ఈ సమావేశాల్లో పరిస్థితులు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నట్టు కనిపించిందని ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా వీధుల్లోకి వచ్చి ఉద్యమానికి మద్దతు ఇవ్వడం దీనికి కారణమని ప్రొఫెసర్ వాంఖేడే అభిప్రాయపడ్డారు.
"చాలా విధాలుగా ఇది ప్రతిపక్షానికి కొత్త ఊపిరినిచ్చింది. ఈసారి పార్లమెంటు సజావుగా నడవడానికి ప్రతిపక్షం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోందనే అభిప్రాయం బలపడింది" అని విశ్లేషించారు.

ఫొటో సోర్స్, ANI

ప్రధాన మంత్రి, బీజేపీల నిర్ణయం వెనక వివిధ రాష్ట్రాలకు రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలు ఒక కారణం కావొచ్చని దిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చంద్రచూడ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ప్రతిపక్షాలు ఇది తమ విజయంగా చెప్పుకుంటున్న ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకోవడానికి ప్రభుత్వానికి కొంత సమయం దొరుకుతుంది.
''ఈ 'విజయం' ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న ప్రతిపక్షం, ఉత్తరప్రదేశ్ ఎన్నికల నాటికి తమ జోరును కొంతమేర కోల్పోతుందని బీజేపీ భావించి ఉండొచ్చు, 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉంది. ఒకవేళ వారి ఇమేజ్‌కు కొంత దెబ్బ తగిలినా, ఆ పరిస్థితిని చక్కదిద్దుకునే సమయం ప్రధాన మంత్రికి ఉంటుంది'' అని చంద్రచూడ్ సింగ్ అన్నారు.
తమిళనాడులో కనిపించినట్లుగా 'జెన్-జెడ్' ప్రభావంతో సాధించిన రాజకీయ విజయాల ఉదాహరణలను బీజేపీ పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని నీర్జా చౌధరి అభిప్రాయపడ్డారు. దేశంలోని ఓటర్లలో మొదటిసారి, రెండోసారి ఓటు వేసేవారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. "ఉత్తరప్రదేశ్ వంటి రాజకీయంగా కీలకమైన రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వారిని దూరం చేసుకోవాలని ప్రభుత్వం కోరుకోదు" అని నీర్జా చౌధరి అన్నారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల ఓటర్లలో బీజేపీ గణనీయమైన ప్రజాదరణను కలిగి ఉందన్న విషయాన్ని గమనించాలి.
'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్' విశ్లేషణ ప్రకారం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ వయో వర్గానికి చెందిన ఓటర్లలో 37 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు. ఈ శాతం 2019లో 40 శాతానికి పెరిగింది. 2024లో 39 శాతంగా నమోదైంది.

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images

కొత్త కార్యకర్తలను చేర్చుకునే ప్రయత్నాల్లో, కేవలం ఎన్నికల రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా యువతపై ఎప్పుడూ ఆరెస్సెస్ ప్రత్యేక దృష్టి పెడుతుందని ప్రొఫెసర్ చంద్రచూడ్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీతో ఉన్న బలమైన సంబంధాల దృష్ట్యా, యువత తమ ఆగ్రహాన్ని ఆ పార్టీపై చూపించాలని ఆర్ఎస్ఎస్ కోరుకోదు.
"జెన్-జెడ్ తరం తమతో కలిసి నడవాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. భారతదేశం ఒక యువ దేశం. విద్యా రంగంలో ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా చురుకుగా వ్యవహరిస్తోంది. దేశంలోని విద్యా సంస్థలపై తమ పట్టును కొనసాగించాలని భావిస్తోంది" అని ఆయన అన్నారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో విద్యార్థులు కీలక భాగమని, ఈ స్థాయిలో విద్యార్థుల నుంచి వ్యక్తమయ్యే ఆగ్రహం ఆ సంస్థకు నష్టం కలిగించవచ్చని అదితీ ఫడ్నిస్ అభిప్రాయపడ్డారు.
"ఇటువంటి యువజన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తే, ఆర్ఎస్ఎస్, దాని విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రమైన ఎదురుదెబ్బలను ఎదుర్కోవాల్సి రావచ్చు. విద్యార్థి వర్గమే వారికి ప్రధాన పునాది. కాబట్టి, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి సంఘం ఎన్నికలను, వాటిలో ఏబీవీపీ పనితీరును మనం నిశితంగా గమనించాలి" అని ఫడ్నిస్ అన్నారు.

ఫొటో సోర్స్, Sachin KUMAR / AFP via Getty Images

ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో, ''ఈ నిరసనలను "స్వప్రయోజనాల కోసం" వాడుకుంటున్న "విద్రోహ శక్తుల" గురించి ప్రస్తావించార''ని నీర్జా చౌధరి గుర్తు చేశారు. దీనిని బట్టి ప్రభుత్వం భారత ఉపఖండంతోపాటు దక్షిణాసియాలోని విస్తృత ప్రాంతాలలో రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని ఆమె అభిప్రాయపడుతున్నారు. "బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలలో ప్రభుత్వాలు విద్యార్థుల అశాంతి కారణంగా వైదొలగవలసి వచ్చింది. భారతదేశం స్థిరమైన ప్రజాస్వామ్యం కలిగిన ఇంత విశాలమైన దేశం కాబట్టి ఇక్కడ అలాంటి ఫలితం వచ్చే అవకాశం లేదు. కానీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి?" అని అన్నారామె.
ప్రొఫెసర్ చంద్రచూడ్ సింగ్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. బంగ్లాదేశ్ లేదా నేపాల్ వంటి పరిస్థితిని భారతదేశం ఎదుర్కొనే అవకాశం లేనప్పటికీ, ఆ ఆందోళన ప్రభుత్వం మనసులో కచ్చితంగా ఉండి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి పరిస్థితి వస్తే అది ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠకు దెబ్బతగిలి ఉండేదని చంద్రచూడ్ సింగ్ అన్నారు.
"ఇది పెట్టుబడులపై ప్రభావం చూపి, ఆర్థిక వ్యవస్థను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేసి ఉండేది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























